Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: హమ్మయ్యా… మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది!

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్‌ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ పూర్తయిపోయింది. ‘భవదీయుడు భగత్ సింగ్’ గా ఈ సినిమా ఏ ముహూర్తాన మొదలైందో కానీ పాపం… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దర్శకుడు హరీశ్ శంకర్ ను అలా ఇలా ఆడుకోలేదు. ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ ను తమ హీరోకు ఇచ్చాడనే అభిమానం కూడా లేకుండా దారుణంగా హరీశ్ శంకర్ ను ట్రోల్ చేశారు. ఇక ఈ సినిమా పేరు మారడం, ఇదో తమిళ సినిమాకు రీమేక్ అనే ప్రచారం జరగడంతో ఆ ట్రోలింగ్ పీక్స్ కు చేరుకుంది. ఒకానొక దశలో హరీశ్ శంకర్ మూవీ ఉండదనే ప్రచారమూ భారీగా సాగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ వేరు ప్రాజెక్ట్స్ ను సెట్స్ పైకి తీసుకు రావడంతో అభిమానులు చేసిన ప్రచారం నిజమేనేమో అనే సందేహమూ కొందరికి వచ్చింది. అయితే వాటన్నింటినీ త్రోసి రాజంటూ ఈ సినిమా ఇటీవల సెట్స్ పైకి ఎక్కేసింది. అంతేకాదు… ఎనిమిది రోజుల పాటు జరిగిన తొలి షెడ్యూల్ ఇప్పుడు పూర్తయ్యింది కూడా.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ లో స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్ వెయ్యి మంది కి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు. అలానే పలువురు పిల్లలతో వినోదభరితమైన సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో, హీరోయిన్లు పవన్ కళ్యాణ్, శ్రీలీల పై రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేశారు. ఇందులో నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, ‘టెంపర్’ వంశీ, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ తదితరులు నటించారు. మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాల పట్ల చిత్ర బృందం సంతృప్తిగా ఉంది. బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అదిరిపోయే డైలాగ్స్, స్పెల్-బౌండింగ్ మేనరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో నిండిన కథతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా అయనంకా బోస్, ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్… ఇలా అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘గబ్బర్ సింగ్’ కోసం మెమరబుల్ ఆల్బమ్‌ ని అందించిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, మరో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి తెలిపారు.

Exit mobile version