Site icon NTV Telugu

కిన్నెర క‌ళాకారుడికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న ‘భీమ్లా నాయక్‌’ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట విశేష ఆదరణ పొందింది. ఈ పాటతో తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు మొగులయ్య పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ పాటలో కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఆయన కనిపిస్తాడు.

ఆడాగాదు ఈడాగాదు… అమీరోళ్ల మేడాగాదు
గుర్రం నీళ్ల గుట్టాకాడ… అలుగూ వాగు తాండాలోన
బెమ్మా జెముడు చెట్టున్నాది..

అంటూ పాడిన మొగులయ్య స్వరానికి అప్పుడే అభిమానులు ఏర్పడ్డారు. ఆయన పాడిన పాత జానపద పాటల కోసం కూడా తెగ వెతికారట.. 7 మెట్ల కిన్నెరను 12 మెట్లగా మార్చి తన జానపద పాటలతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరుగుతూ తన పాటలతో ఎంతోకొంత డబ్బును సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏ రాష్ట్రాలలో కూడా 12 మెట్ల కిన్నెర వాయించే కళాకారులు ఎవరు లేకపోగా గతంలో ఈయనను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆయనను సత్కరించింది.

నాయన పేరు సోమ్లా గండు
తాత పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యా నాయక్
పెట్టిన పేరు భీమ్లా నాయక్
సెభాష్ భీమ్లా నాయక్

ఇక పవన్ కళ్యాణ్ కూడా మొగులయ్య ప్రతిభను గుర్తించి బీమ్లా నాయక్ లో పాడే అవకాశాన్ని కలిపించారు. అంతేకాదు, తాజాగా ఆయనకు పవన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు అందించనున్నారు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలన్నారు పవన్ కళ్యాణ్…

Exit mobile version