Parvathy Nair Files Petition In Egmore Court On Sheldon George Subhash Chandrabose: తన ఇంట్లో పని చేసే సుభాష్ చంద్రబోస్‌పై పార్వతీ నాయర్ పెట్టిన చోరీ కేసు రానురాను మరింత ముదురుతోంది. రూ.9 లక్షల విలువైన రెండు వాచీలు, లాప్ టాప్, సెల్ ఫోన్ చోరీ అవ్వడం.. ఆ సమయం నుంచే సుభాష్ కూడా కనిపించకపోవడంతో.. అతనిపై అనుమానంతో పార్వతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ వ్యవహారంలో సుభాష్ మరోలా స్పందించాడు. పార్వతీ అర్థరాత్రి సమయాల్లో తన మగ స్నేహితులతో పార్టీలు చేసుకుంటుందని, ఈ విషయాన్ని గమనించినందుకు తన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని తెలిపాడు. ఆ విషయంలో ప్రతీకారం తీసుకోవడం కోసమే తనపై కేసు పెట్టిందని ఆరోపించాడు. అతనితో పాటు పార్వతీ మేకప్‌మ్యాన్ షెల్డన్ జార్జ్ కూడా ఆమె పరువుకి భంగం కలిగించేలా ఒక వీడియోని విడుదల చేశాడు. ఈ రెండు విషయాలపై పార్వతీ తాజాగా స్పందించింది. దురుద్దేశంతోనే ఆ ఇద్దరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి తన వద్ద పార్ట్ టైంగా పనిచేసే వాడని, తన కుక్కల సంరక్షణ బాధ్యతలను అతడు నిర్వహించే వాడని పార్వతీ నాయర్ తెలిపింది. తన ఇంట్లో వస్తువులు పోయినప్పుడు.. తాను ఫిర్యాదు చేసే ముందు సుభాష్‌ని అడిగానని, అతడు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకున్నాడని పేర్కొంది. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే.. అతడ్ని కొట్టినట్టు, దుర్భాషలాడినట్లు సుభాష్ చేసిన ఆరోపణల్లోనూ నిజం లేదని స్పష్టం చేసింది. ఇక షెల్డన్ జార్జ్ రిలీజ్ చేసిన వీడియోపై స్పందిస్తూ.. ఈ ఏడాది మే 9వ తేదీన ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ సంఘటన జరిగిందని, దాన్ని వక్రీకరించి వీడియోని చిత్రీకరించాడని చెప్పింది. ఇది తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే చర్యేనని మండిపడింది. ఈ నేపథ్యంలోనే షెల్డన్‌తో పాటు తన పని మనిషి సుభాష్‌పై తగిన తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎగ్మోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని.. అలాగే జాతీయ మహిళా కమిషన్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశానని పార్వతీ నాయర్ వివరించింది. ఈ వ్యవహారంలో చట్టపరంగా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చింది.