స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను దేశం యావత్తు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘1770’ని అనౌన్స్ చేశారు. బకించంద్ర ఛటర్జీ రాసిన ‘ఆనంద్ మఠ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దగ్గర ‘ఈగ, బాహుబలి’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. గత యేడాది విడుదలైన ‘ఆకాశవాణి’ మూవీతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు.
ఈ సందర్భంగా అశ్విన్ గంగరాజు మాట్లాడుతూ ”ఇది నాకు పెద్ద ఛాలెంజింగ్ సబ్జెక్ట్. అయితే లెజెండ్రీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను మాత్రమే నేను అందించాలి. అద్బుతమైన పీరియాడిక్ సెట్స్, అద్భుతమైన ఎమోషన్స్, లార్జర్ దేన్ లైఫ్ యాక్షన్ తదితర ఎలిమెంట్స్ ఉన్న సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో పక్కాగా సరిపోయాయి. ముందు కాస్త సందేహించాను. కానీ రామ్ కమల్‌గారితో మాట్లాడిన తర్వాత ఆయన విజన్ తెలుసుకున్నాను. నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమాను తెరకెక్కించటానికి సిద్ధమయ్యాను. అలాగే నిర్మాతలు శైలేంద్ర కుమార్, సుజయ్ కుట్టి, కృష్ణ కుమార్.బి, సూరజ్ శర్మలను రీసెంట్‌గా ముంబైలో కలిశాను. సినిమాను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం గురించి అందరం సుదీర్ఘంగా చర్చించాం. వారు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు.. వారి టీమ్ వర్క్ చూసి వెంటనే వారితో కనెక్ట్ అయ్యాను” అని అన్నారు.
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ”వందేమాతరం అనేది ఓ మ్యాజికల్ పదం. ఈ మంత్రాన్ని బకించంద్ర ఛటర్జీ అనే మహర్షి మనకు అందించారు. ఇది జాతినంతటినీ ఏకం చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేలా చేసింది. 1770లో భారత స్వాతంత్య్ర సమరం కోసం మనలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెందరో ఉన్నారు. వారి గురించి తెలియజేసే చిత్రమే ‘1770’ ” అని అన్నారు. రామ్ కమల్ మాట్లాడుతూ ‘‘అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నేను చూశాను. నాకెంతగానో నచ్చింది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన రచనను చేశారు. ఆయన ఆలోచనలు యూనిక్‌గా ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాలో ఆయన కథ, కథనం సరిహద్దులను దాటి ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇలాంటి ఓ మంచి టీమ్ కుదరటం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు. ‘లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను నిర్మించటానికి ఇదే సరైన సమయమ’ని ఎస్.ఎస్. 1 ఎంటర్‌టైన్మెంట్ శైలేంద్ర కె.కుమార్ తెలిపారు. పి.కె. ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూరజ్ శర్మ.. జీ స్టూడియోస్ మాజీ హెడ్ సుజయ్ కుట్టి, నిర్మాత కృష్ణకుమార్ తో కలిసి సినిమా చేయటం కల నేరవేరినట్లుగా ఉందని తెలిపారు. ”వందేమాతరం సినిమాను పాడుతూ పెరిగాం. అదే సమయంలో రామ్ కమల్ నన్ను కలిసి ఆనంద్ మఠ్ కథ గురించి చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌గారు ఆయన స్టైల్ ఆఫ్ నెరేషన్‌ను అందించారు. దాన్ని వినగానే చాలా బాగా నచ్చేసింది. ఈ అసాధ్యమైన కలను సుసాధ్యం చేస్తోన్న నా మిత్రులకు ధన్యవాదాలు. ఇది సినిమా కాదు.. నా కల నిజమవుతున్న రోజు. వెండితెరపై ఓ అద్భుతమైన చిత్రం ఆవిష్కృతం కానుందని’’ శైలేంద్ర తెలిపారు. జీ స్టూడియోస్‌పై హిస్టారికల్ బ్లాక్ బస్టర్ ‘మణికర్ణిక’ చిత్రాన్ని రూపొందించిన సుజోయ్ కుట్టి మాట్లాడుతూ ”విజయేంద్రప్రసాద్‌గారితో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయన చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఆయన ఈ సినిమాకు రైటర్ కాకుండా ఉండుంటే ఈ సినిమాను నేను చేసేవాడిని కాను” అని చెప్పారు. అన్నారు. ‘1770’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా ఎవరు నటిస్తారనే విషయాన్ని దసరా ముందుగా నిర్ణయించబోతున్నారు.