బాలీవుడ్ మొదటి తరం హీరోల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటుడు పైడి జయరాజ్. సెప్టెంబర్ 28 ఆయన జన్మదినం. ఆ సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ‘పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. పలు కష్టనష్టాలకు ఓర్చి హీరోగా ఎదిగి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం గర్వకారణం. అయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి. అయన జ్ఞాపకార్థం రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ హల్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫిలింనగర్ ప్రాంతంలో అయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది’ అన్నారు. జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో దర్శకుడు కంకనాల శ్రీనివాస్ రెడ్డి, ప్రియాంక తో పాటు పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
పైడి జయరాజ్ సెప్టెంబరు 28,1909లో జన్మించారు. భారత చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కు చెందిన తెలుగు నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. 156 చిత్రాలలో కథానాయకుడి పాత్రలతోపాటు మొత్తం 300 పైగా మూకీ, టాకీ సినిమాలలో నటించారు. హిందీ, ఉర్దూతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. నటుడిగానే కాక మొహర్, మాలా, ప్రతిమ, సాగర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పైడి జయరాజ్ తెలుగు వాడైనప్పటికీ ఒక్క తెలుగు చిత్రంలో కూడా నటించలేకపోయారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయన 2000 సంవత్సరం ఆగష్టు 11న పరమపదించారు.


