NTV Telugu Site icon

Waltair Veerayya: అతి మంచితనం కూడా ఒక్కోసారి మంచిదే: చిరంజీవి

Chiru1

Chiru1

Chiranjeevi: సంక్రాంతి కానుకగా చిరంజీవి, రవితేజ, శ్రుతీహాసన్ నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ 13వ తేదీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీతో పాటు తన కెరీర్ కు సంబంధించిన విశేషాలను చిరంజీవి పాత్రికేయులకు తెలియచేశారు. ‘వాల్తేరు వీరయ్య’లోని వింటేజ్ వైబ్స్ గురించి తొలుత ఆయన మాట్లాడుతూ, ”కెరీర్ ప్రారంభం నుండి నాలో ఓ రకమైన కాన్ ఫ్లిక్ట్ ఉండేది. నాలోని హిడ్డెన్ టాలెంట్ ను బయట పెట్టుకోగలిగేది… సరదాగా చేయగలిగేది మాస్ అండ్ కమర్షియల్ సినిమాలే! ఫ్యాన్స్ నా నుండి ఏం కోరుకుంటారో తెలుసుకుని అలాంటి సినిమాలు చేస్తుంటాను. అయితే నాకు వ్యక్తిగతంగా వైవిధ్యమైన చిత్రాలు చేయాలనే కోరిక ఉంటుంది. అందువల్లే అప్పట్లో విశ్వనాథ్ గారితో, బాపు గారితో సినిమాలు చేశాను. నా ‘ఖైదీ’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలు దాదాపు ఒకే సమయంలో వచ్చాయి. రెండింటి పాత్రల్లో ఎంతో వైవిధ్యం ఉంది. అయితే… నాకేం కావాలి, నాకేది ఇష్టం అనే దాన్ని పక్కన పెట్టి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, అభిమానులు మన నుండి ఏం ఆశిస్తున్నారు అనే దానికి ప్రాధాన్యం ఇవ్వడం సబబు అనిపించింది. అందులో భాగంగానే కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యమిచ్చాను. కమ్ బ్యాక్ తర్వాత కూడా ఈ రకమైన కాన్ ఫ్లిక్ట్ మరోసారి నాలో మొదలైంది. అందువల్లే ఎప్పటి నుండో చేయాలని అనుకుంటున్న స్వాతంత్ర సమరయోధుడి పాత్రను ‘సైరా’లో చేశాను. పాటలు, కథానాయిక లేకుండా మొన్న ‘గాడ్ ఫాదర్’లో నటించాను. ఇవన్నీ చేసినప్పుడు నాకు నటుడిగా సంతృప్తి కలుగుతుంది. అవి కూడా గౌరవప్రదమైన విజయాలను అందుకున్నాయి. అయితే… ప్రేక్షకుల నూరు శాతం నా నుండి కోరుకునేది ఇవ్వాలనే ప్రయత్నంతో చేసిందే ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తాడు. ఓ ”ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రీ, అన్నయ్య” సినిమాలు ఎలా చేశానో వాటిని మరోసారి గుర్తు చేసుకునే అవకాశం ఈ సినిమాతో కలిగింది. సినిమా షూటింగ్ సమయంలో ఉదయం నుండి సాయంత్రం వరకూ వైబ్రేట్ అవుతుండేవాడిని. ఇది కదా మన ఏరియా అనే ఫీలింగ్ కలుగుతుండేది” అని అన్నారు.

రవితేజతో లేటెస్ట్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతూ, ”రవితేజ ‘ఆజ్ కా గుండా రాజ్’లో నా స్నేహితుడిగా, ‘అన్నయ్య’లో నా తమ్ముడిగా నటించాడు. అదే రవితేజా ఇవాళా నాకు కనిపించాడు. అప్పుడు ఎలా ఉన్నాడో… ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఆహారపు అలవాట్లు కావచ్చు, సరదాగా ఉండే తత్త్వం కావచ్చు… ఏదీ మారలేదు. అతనిలో ఎలాంటి వేరియేషన్స్ నేను గమనించలేదు” అని అన్నారు. కథానాయిక గురించి మాట్లాడుతూ, ”శ్రుతి హాసన్ నా ఫ్రెండ్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురు. మంచి డాన్సర్ కూడా. ఆమెతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ బాగుంది. అవకాశం వస్తే మరోసారి కలిసి నటిస్తాను” అని చిరంజీవి అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా తక్కువగా ఉంటారని, ఎంతో పేషన్ తో వాళ్ళు సినిమాలు తీస్తున్నారని చిరంజీవి చెప్పారు. లాభాపేక్ష కంటే కూడా బెస్ట్ క్వాలిటీ అందించాలన్నదే వారి తపన అని చెప్పారు. ఈ సినిమా బడ్జెట్ విషయంలో తాను ఎప్పటి కప్పుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నానని చిరంజీవి తెలిపారు. పేపర్ వర్క్ లోనే బడ్జెట్ లో మాగ్జిమమ్ సేవ్ చేశామని, అందుకు డైరెక్షన్ టీమ్ బాగా కష్టపడిందని చెప్పారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారని, చిత్రీకరణకు ముందే ఆయనతో మాట్లాడి, ఎంత నిడివిలో యాక్షన్ పార్ట్ చేయగలమని ప్లాన్ చేసి షూట్ చేశామని, తద్వారా బడ్జెట్ ను అదుపులో పెట్టుకోగలిగామని అన్నారు. సినిమాలో ఒక హీరో డైలాగ్ మరొకరు చెప్పడం తమకూ సరదాగా అనిపించిందని, ఓ ఫ్యాన్ బోయ్ గా బాబీకి ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చని చిరంజీవి తెలిపారు. ఈ మూవీలో ఎమోషన్స్ బాగా ఉంటాయని, అలానే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనే చిరంజీవి చెప్పారు. చాలామంది కథలు చెప్పినప్పుడు వింటారని, కానీ తాను చూస్తానని అన్నారు. ‘గాడ్ ఫాదర్’కు ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన కూడా తనకుందని, హీరో ఇరవై యేళ్ళ పాటు దుబాయ్ లో ఏం చేశాడు? అతని కుటుంబం ఏమైపోయింది? అనేది ఆలోచించి, ఎవరు కథ తయారు చేసినా తాను నటించడానికి సిద్ధమని చిరంజీవి చెప్పారు.

ఇవాళ ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీపై ఆకాంక్షలు విధిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ, ”ప్రభుత్వాలు ఏ ఉద్దేశ్యంతో ఏ నిర్ణయాలు తీసుకున్నాయో మనకు తెలియదు. వాటిని తప్పు పట్టడం కూడా సరికాదు. మా సినిమా విషయానికే వస్తే ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కొంత గందర గోళం నెలకొంది. అది కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యే ప్రజలు, అభిమానులు ఇబ్బంది పడకూడనే ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుందని నాకు అనిపించింది. నిర్మాతల మాట నెగ్గలేదనో, ప్రభుత్వం మా మీద కావాలని ఆంక్షలు విధించిందనే నేను అనుకోవడం లేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుండి తేలికగా ఎలా బయట పడి మాగ్జిమమ్ ప్రాఫిట్ పొందగలం, ఫైనల్ రిజల్డ్ ఏమిటీ? అనేదే నేను ఎక్కువ ఆలోచిస్తాను. క్షణికావేశానికి లోనై ప్రతిస్పందిస్తే, మన ఇగో సాటిస్ ఫై కావచ్చు కానీ మనల్ని నమ్ముకున్న వ్యక్తులు, నిర్మాతలు ఇబ్బందుల పాలు అవుతారు. నేను కాస్తంత ఎక్కువ మంచితనంతో వ్యవహరిస్తున్నానని కొందరు విమర్శించినా, అదే సరైనదనేది నా అభిప్రాయం” అని వివరణ ఇచ్చారు. తెలంగాణలో ఆరు ఆటల ప్రదర్శనకు అనుమతిని ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వానికి, ఏపీలో టిక్కెట్ ధరను పాతిక రూపాయలు పెంచుకునే వెసులు బాటు కల్పించిన జగన్ ప్రభుత్వానికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

చిరు లీక్స్… అన్నీ స్ట్రాటజీ లీక్సే!
”స్మగ్లింగ్ చేసే ఓ జాలరి కథ ఇది. అతనికి అదనపు ఆదాయం కూడా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే రిచ్ వేషధారణలో ఉంటాడు. ఈ పాత్రను, దాని స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని మా అమ్మాయి సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది” అంటూ వీరయ్య క్యారెక్టర్ గురించి కొంత లీక్ చేశారు చిరంజీవి. మీడియా సమావేశంలో ఒకటి రెండు సందర్భాలలో సినిమాలోని హైలైట్స్ ను ముందే లీక్ చేయబోయిన చిరంజీవి చివరి నిమిషంలో కంట్రోల్ చేసుకున్నారు. హీరో ఇండ్రక్షన్ సీన్ ను దర్శకుడు బాబీ లీక్ చేశాడని, ఇంటర్వెల్ బ్లాక్ గురించి మీరు చెబితే బాగుంటుందని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ‘లీక్ చేసే నా అలవాటును బాబీ తీసుకున్నాడా!?’ అని ఎదురు ప్రశ్నిస్తూ, ‘విక్కీ లీక్స్ లాగా చిరు లీక్స్ అనేది బాగానే పాపులర్ అయ్యింద’ని వ్యాఖ్యానించారు. అయితే ఓ స్ట్రాటజీ ప్రకారమే తాము లీక్ చేస్తుంటామ’ని సరదాగా అన్నారు చిరంజీవి.