Producer T.G. Vishwaprasad: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పాటు మొత్తం పదికి పైగా సినిమాలను నిర్మిస్తోంది ఈ సంస్థ. ఇక ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సినిమా జూన్ 16న విడుదలవుతున్న నేపథ్యంలో విలేకరులతో సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికను వివరించారు టి.జి. విశ్వప్రసాద్. ‘ఆదిపురుష్’ ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని భావించి మార్కెట్ బేరీజువేసుకుని తెలుగు రైట్స్ తీసుకున్నామంటున్నారు విశ్వప్రసాద్. అంతేకాదు భవిష్యత్ లో టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన కుదుర్చుకున్నామని, అందులో భాగంగానే ‘స్పిరిట్’ సినిమాని కూడా తెలుగులో తామే విడుదల చేస్తామన్నారు.
Read Also: Bhola Shankar: 1988లో చివరి సినిమా.. ‘భోళాశంకర్’ చిరంజీవి ఆగస్ట్ సక్సెస్ రేటు పెంచేనా!?
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ తమను కుటుంబసభ్యుడు లాంటివారు అనటంపై స్పందిస్తూ ప్రభాస్ అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో అనుబంధం తమ అదృష్టమన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ను ఒక ఫ్యాక్టరీ మోడల్ లో స్టార్ట్ చేశామని, అదృష్టం కొద్దీ సక్సెస్ శాతం ఎక్కువగానే ఉందని, ఈ జర్నీలో పరాజయం ఎదురైనా పునరావృతం కాకుండా పరాజయాల నుంచి కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళతామని, ఫాస్ట్ గా వంద సినిమాల నిర్మాణం ఇటీవల పెట్టుకున్న లక్ష్యమని అందులో తొలి 25 సినిమాలకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నామని, తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేస్తామంటున్నారు విశ్వప్రసాద్. ప్రస్తుతం 5 సినిమాల నిర్మాణం పూర్తయిందని, 15 దాకా నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. ఓటీటీ బిజినెస్ చాలా కీలకంగా మారిందన్నారు.
తెలుగు రాష్ట్రాలలో ‘ఆదిపురుష్’ టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగిందని, రెండు ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. హనుమంతుడికి ప్రతి థియేటర్ లో సీటు కేటాయించడం ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనమంటూ ఉచితంగా టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదని, ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో కొందరు ముందుకు వచ్చి చేస్తున్నారన్నారు. సెట్స్ మీద ఉన్న 15 సినిమాల ద్వారా పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులని కూడా పరిచయం చేయబోతున్నామని, వాటిలో ఎనిమిది నుంచి పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలే అన్నారు. వచ్చే రెండుమూడేళ్ళలో ప్యాన్ వరల్డ్, హాలీవుడ్ సినిమాలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్టీఆర్ శతజయంతికి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టాలి అని అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నామని, కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని, త్వరలో విగ్రహం ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు విశ్వప్రసాద్.