Organic Mama Hybrid Alludu: ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఇందులో టైటిల్స్ రోల్స్ ను రాజేంద్ర ప్రసాద్, సోహైల్ పోషిస్తున్నారు. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడీగా మీనా, సోహైల్ కు జంటగా మృణాళిని రవి నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం సమకూర్చుకోవడం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి అలవాటే. అయితే ఈ సినిమాకు ఆయనే మాటలు కూడా రాసుకోవడం విశేషం. మార్చిలో ఈ మూవీ జనం ముందుకు రాబోతున్న సందర్భంగా సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తొలుత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ”గత 46 సంవత్సరాలుగా నటుడిగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. నేను ఇంతకాలం కొనసాగటానికి నేను నమ్ముకున్న కామెడీనే కారణం. ”మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు”తో నా కామెడీకి బ్రాండ్ క్రియేట్ కావడంలో ముఖ్యపాత్ర పోషించారు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అందరినీ అలరించే చిత్రాలతో విజయవిహారం చేసిన ఎస్.వి. కృష్టారెడ్డి, నేను, అచ్చిరెడ్డి మళ్లీ ఇంతకాలం తర్వాత మరో విజయవంతమైన చిత్రంతో జనం ముందుకు వస్తున్నాం. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేసిన మేం, ఇప్పుడు కూడా అలాంటి సినిమాతోనే రాబోతున్నాం. మీనా కెరీర్ ప్రారంభంలో నాతో చేసింది. మళ్లీ ఇంతకాలానికి మా కాంబినేషన్ కుదిరింది. ఆమెకు అనుకోని కష్టం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోసం వీలైనంత త్వరగా షూటింగ్‌కు హాజరైంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లతో పనిచేయడం వల్ల ఆమెకు ఆ మంచి గుణం అబ్బింది. ఆమెకు ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్ చెపుతున్నాను” అని అన్నారు. నటి మీనా మాట్లాడుతూ, ”ఈ కథ చెపుతున్నప్పుడే కృష్ణారెడ్డి గారు ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. అంతగా ఆయన ఈ క్యారెక్టర్స్ లో ఇన్‌వాల్వ్ అయిపోయారు. నాకు ఇది కొత్త క్యారెక్టర్‌గానే చెప్పాలి. రాజేంద్రప్రసాద్ గారితో 30 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. కృష్ణారెడ్డిగారితో వర్క్ చేయాలని చాలాసార్లు అనుకున్నా డేట్స్ ప్రాబ్లమ్‌తో కుదరలేదు. ఆయన ‘శుభలగ్నం’ సినిమా ఏదైనా భాషలోకి రీమేక్ చేస్తే నేను చేస్తాను అని ఆయనతో చెప్పాను. కానీ కుదరలేదు. తొలిసారిగా నేను ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నాను. ఆమెతో చాలా మంచి అనుబంధం ఏర్పడింది” అని అన్నారు.
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ”’వినోదం’ తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు, మంచి డైలాగ్స్‌కు స్కోప్ ఉన్న కథ ఇది. మీకు నచ్చే అన్ని అంశాలనూ పుష్కలంగా ఏర్చి కూర్చిన సినిమా ఇది” అని అన్నారు. కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ”కృష్ణారెడ్డి చిత్రాలలో ఉండే మ్యాజిక్ తో పాటు చక్కని మెసేజ్ ఉన్న చిత్రం ఇది. క్లైమాక్స్‌లో వచ్చే మాస్ సాంగ్ అందరికీ సూపర్ కిక్ ఇస్తుంది. ఈ పాట రాసింది చంద్రబోస్, పాడింది రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్.’ లోని ‘నాటు నాటు’ పాట ఎంత సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం” అని అన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సోహైల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు కల్పన, నటి హేమ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రాకెట్ రాఘవ కూడా పాల్గొన్నారు.
