హాలీవుడ్ స్టార్ హీరోస్ బెన్ అఫ్లెక్, మ్యాట్ డామ్ కలసి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. గతంలో వీరిద్దరూ కలసి నటించిన “గుడ్ విల్ హంటింగ్, ద లాస్ట్ డ్యుయల్, చేజింగ్ అమీ, ద లీజర్ క్లాస్” చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో ‘గుడ్ విల్ హంటింగ్’ విశేషాదరణ చూరగొంది. ప్రస్తుతం బెన్, మ్యాట్ నటించబోయే స్పోర్ట్స్ డ్రామా రచనలో వీరిద్దరూ పాలు పంచుకోవడమే కాదు, నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. వీరికి అమెజాన్ స్టూడియోస్, స్కై డాన్స్ స్పోర్ట్స్, మండలే పిక్చర్స్ దన్నుగా నిలిచారు.
ఇక అసలు విషయానికి వస్తే, బెన్, మ్యాట్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామా ప్రఖ్యాత ‘నైక్’ సంస్థకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన ‘సోనీ’ వక్కారో జీవితగాథ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో ‘నైక్’ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫిల్ నైట్ పాత్రలో బెన్ అఫ్లెక్ కనిపించనుండగా, వక్కారో పాత్రను మ్యాట్ డామ్ ధరించబోతున్నారు. 1980ల మధ్యకాలంలో ‘నైక్’ సంస్థ మూడో స్థానంలో సాగుతోంది. ఆ సమయంలో బాస్కెట్ బాల్ సూపర్ స్టార్ గా మైఖేల్ జోర్డాన్ తో డీల్ కుదుర్చుకొని ‘నైక్’ సంస్థను అగ్రస్థానంలో నిలిపారు. నైక్ కంపెనీని అగ్రపథంలో నిలపడానికి, జోర్డాన్ ను తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి వక్కారో ఎలా తపించారు అన్నదే ఇందులోని ప్రధానాంశమట! జోర్డాన్ కన్నతల్లిని, ఆయన కోచ్ లను, మిత్రులను అందరినీ కలసి అతణ్ణి తమ బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసేందుకు వక్కారో ఎలా ఒప్పించారు అన్న అంశాలతోనే కథ సాగనుంది. చిత్రమేమిటంటే, కథలో వక్కారో శ్రమ, తపన కనిపిస్తాయి. కానీ, అతను ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని భావించారో, ఆ మైఖేల్ జోర్డాన్ పాత్ర తెరపై కనిపించదనీ తెలుస్తోంది. ఈ తరహా కథలను ‘హైడ్ అండ్ సీక్’ ఫార్మాట్ లో రూపొందాయంటారు. మన ‘మాయాబజార్’లో తరచూ పాండవుల ప్రస్తావన వినిపిస్తున్నా, సినిమా మొత్తంలో వారు ఎప్పుడూ కనిపించరు. అదే తీరున అన్న మాట! మరి ఈ సారి బెన్, మ్యాట్ ఈ స్పోర్ట్స్ డ్రామాతో ఏ తీరున ఆకట్టుకుంటారో చూడాలి.