పాన్ ఇండియా సినిమాలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సినిమాలను విడుదల చేసిన వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటే… మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన సినిమా మేకర్లను కరోనా, దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రెండూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల కారణంగా దేశంలోని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలను పలుమార్లు వాయిదా వేసుకున్న పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయ్యింది.
తాజాగా తమిళనాడు ప్రభుత్వం జనవరి 10 వరకు కొనసాగనున్న కోవిద్-19 ఆంక్షలను ప్రవేశపెట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనల మధ్య ఈ ఆంక్షలు పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కరోనా కారణంగా ఏర్పడిన గత సంక్షోభం కారణంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం అక్కడ హోటళ్లు, లాడ్జీలు మరియు రెస్టారెంట్లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, బట్టలు, నగల దుకాణాలు, జిమ్‌లు, యోగా కేంద్రాలు, క్లబ్‌లు, మెట్రో రైలు, సినిమా హాళ్లు, ఇండోర్ స్టేడియం, సెలూన్‌లు, స్పాలు, బ్యూటీ పార్లర్‌లకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ కేసులు గనుక తగ్గకపోతే మరిన్ని ఆంక్షలు పెంచే దిశగా తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Read Also : ‘ఆర్ఆర్ఆర్’కు కరోనా తిప్పలు… మేకర్స్ షాకింగ్ నిర్ణయం !?
ఢిల్లీలో ఇప్పటికే సినిమా హాళ్లు మూతపడ్డాయి. ముంబైలో 50% ఆక్యుపెన్సీతో సాయంత్రం వరకు షోలు వేసుకోవచ్చు. కానీ సాయంత్రం 5 తరువాత థియేటర్లను నడపడానికి అనుమతి లేదు. మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లలో 50% సీటింగ్ ఆక్యుపెన్సీ అంటూ నిబంధనలు విధించడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇక ఇప్పుడు తమిళనాడులో కేవలం 50% ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడవనున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ నమోదయ్యే కేసులను బట్టి పలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, న్యూఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూలతో పాటు థియేటర్లలో 50% ఆక్యుపెన్సీ, ఇంకా పలు ఆంక్షలు విధించారు. ఇది నిజంగా పాన్ ఇండియా సినిమాలకు గట్టి దెబ్బ అని చెప్పక తప్పదు. కరోనా మహమ్మారి దెబ్బకు పాన్ ఇండియా సినిమాలు విలవిలలాడుతున్నాయి. ఇక ఇప్పుడు సినిమాలను వాయిదా వేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు పాన్ ఇండియన్ మూవీ మేకర్స్ కు !!