Big Update on Pawan Kalyan’s OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని అభిమానులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా కళ్యాణ్‌కు సుజీత్ ఇచ్చిన మాస్ ఎలివేషన్లు థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఈ విజయంతోనే ‘ఓజీ 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల ‘ఓజీ 2’ ప్రాజెక్ట్‌పై పవన్ టీమ్ నుంచి పరోక్షంగా సంకేతాలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న దర్శకుడు సుజీత్ త్వరలో భారత్‌కు తిరిగి రానున్నాడు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో కథా చర్చలు జరిపి సీక్వెల్‌కు తుది రూపు ఇవ్వనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్‌లో అధికారిక ప్రకటన చేసి.. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త కూడా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ‘ఓజీ’ తొలి భాగాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే ‘ఓజీ 2’ విషయంలో నిర్మాణ భాగస్వామ్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’తో పాటు టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ ప్రముఖ బ్యానర్ ఏదనే విషయంపై స్పష్టత లేకపోయినా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ‘ఓజీ’లో పవన్ కళ్యాణ్ పాత్రను సుజీత్ డిజైన్ చేసిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక అభిమానిగా పవన్‌ను వెండితెరపై చూపించిన విధానం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. దీంతో ‘ఓజీ 2’లో అంతకుమించిన మాస్ ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కబోతున్న ‘ఓజీ 2’తో సుజీత్ మరోసారి పవర్ స్టార్ అభిమానులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

