Odiya Actor Babushan Mohanty Hospitalised Due To Low Oxygen Levels: ఒడియా చలనచిత్ర నటుడు బాబూషాన్ మహంతి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు చికిత్స నిమిత్తం శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. ఎప్పుడూ లేనంతగా మహంతి సినిమా షూటింగ్ సెట్స్‌లోనే కుప్పకూలడంతో.. భయాందోళనకు గురై, అతడ్ని భువనేశ్వర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆరుగురు వైద్య నిపుణుల బృందం ఇతనికి మెరుగైన చికిత్స అందించింది. ఫలితంగా అతడు క్రమంగా కోలుకున్నాడు. మరుసటి రోజు కల్లా అతడు సాధారణ స్థితికి వచ్చేశాడు. ఫలితంగా.. అతని భార్య తృప్తి ఆసుపత్రికి చేరుకొని, అతడ్ని ఇంటికి తీసుకెళ్లింది.
నిజానికి.. కుటుంబ కలహాల కారణంగా బాబుషాన్, తృప్తి కొన్ని నెలల నుంచి విడివిడిగానే ఉంటున్నారు. వీరి మధ్య విభేదాలు తొలగించేందుకు కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు కానీ.. ఫలితం లేకుండా పోయింది. అయితే.. భర్త అస్వస్థతకు గురైన సంగతి తెలిసి, ఆమె విభేదాలను పక్కన పెట్టి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త పూర్తిగా కోలుకునే వరకు, దగ్గరుండి అన్నీ చూసుకుంది. చికిత్స తర్వాత భర్త పూర్తిగా కోలుకున్నాక.. భర్తని అత్తారింటికి తీసుకెళ్లింది. కాగా.. బాబుషాన్ ప్రస్తుతం ధామన్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కీలక సన్నివేశాల్ని లడక్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఆక్సిజన్ స్థాయి దిగజారి, అతడు అస్వస్థతకు గురయ్యాడు.