అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో ఏ. యమ్. ఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ మధు’. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శక నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ‘ఓ మధు’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఆమెతో పాటే మాజీ ఎమ్మెల్యే నగేష్, నిర్మాత సత్యారెడ్డి, అడిషినల్ యస్.పి. లక్ష్మణ్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై యూనిట్ సభ్యులను అభినందించారు.
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్మన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ”ట్రైలర్ చాలా బాగుంది. మా ముందు పుట్టి, పెరిగిన అబ్బాయి ఈ రోజు హీరోగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. తల్లి కోరిక తన కొడుకు డాక్టర్ కావాలని, తండ్రి కోరిక యాక్టర్ అవ్వాలని.. అందుకే హీరో డాక్టర్ గా, యాక్టర్ గా రాణించి తల్లిదండ్రులు కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను” అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే నగేష్ మాట్లాడుతూ, ”సినీ నేపథ్యం ఉన్నవాళ్లే సినిమా ఇండస్ట్రీలో నటుడుగా కాలు పెట్టడానికి చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఎటువంటి సినిమా నేపథ్యం లేని ఎ.యమ్. ఖాన్ ఈరోజు ఈ సినిమా చేయడం సంతోషం. భువనగిరి నుంచి ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి. యాదగిరిగుట్ట ఖిల్లా మహత్యం అనుకుంటాను. ఖాన్ కొడుకు ఈరోజు హీరో అవ్వడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. చిత్ర నిర్మాత ఎ.యమ్. ఖాన్ మాట్లాడుతూ, ”సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 29 న వస్తున్నాం” అని అన్నారు.