NTV Telugu Site icon

NTR: హిందీలో యన్టీఆర్ ఫ్యామిలీ!

Ntr

Ntr

NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ లోని యన్టీఆర్ సన్నిహితులు పైకి ఏమీ చెప్పకున్నా, జూనియర్ హిందీ సినిమా ఎంట్రీ భారీ స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు. ఈ హిందీ చిత్రంలో హృతిక్ రోషన్ కూడా కలసి జూనియర్ తో నటిస్తారనీ సమాచారం. ఒకప్పుడు ఇండియాలో టాప్ డాన్సర్స్ సర్వేలో నంబర్ వన్ స్థానం జూనియర్ ఆక్రమించగా, తరువాతి స్థానంలో అల్లు అర్జున్, మూడో స్థానంలో హృతిక్ రోషన్ నిలిచారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు టాప్ డాన్సర్స్ కలసి నటిస్తే, అందులో వారిద్దరిపై కలిపి ఓ పాటను చిత్రీకరిస్తే అది తప్పకుండా “నాటు నాటు…” సాంగ్ ను మించిపోతుందనీ బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా యంగ్ టైగర్ యన్టీఆర్ హిందీ సినిమా ఎంట్రీ మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశమయింది.

ఇప్పటి దాకా తాను నటించిన అనువాద చిత్రాలతోనే హిందీ జనాన్ని పలకరించిన జూనియర్, ఈ సారి నేరుగా హిందీ సినిమాలోనే నటించడం అక్కడి వారికీ ఆనందం పంచుతోంది. నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ ఆరంభంలోనే హిందీ చిత్రాలలో నటించారు. యన్టీఆర్ హీరోగా కేవీ రెడ్డి రూపొందించిన ‘పాతాళభైరవి’ (1952) హిందీలోనూ రీమేక్ అయింది. అక్కడ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. తరువాత మహానటి భానుమతి స్వీయదర్శకత్వంలో నటించి, నిర్మించిన త్రిభాషా చిత్రం (తెలుగు, తమిళ, హిందీ)- ఆ నాటి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘చండీరాణి’ (1953)లోనూ రామారావు హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగులో కంటే హిందీలోనే మంచి విజయాన్ని సాధించడం విశేషం. ఆ పై యన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రం ‘సంతోషం'(1955)ను తెలుగు, హిందీ భాషల్లో జూపిటర్ సంస్థ నిర్మించింది. హిందీలో ఈ చిత్రం ‘నయా ఆద్మీ’పేరుతో విడుదలై ముంబైలో 42 వారాలు ప్రదర్శితమయింది. ఇలా యన్టీఆర్ హిందీలో నటించిన మూడు చిత్రాలు విజయాన్ని చవిచూశాయి. ఇక ఆయన నటించిన “లవకుశ, నర్తనశాల, పాండవవనవాసము” వంటి పౌరాణికాలు హిందీలోకి అనువాదమై అక్కడా రజతోత్సవాలు జరుపుకున్నాయి. యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు హిందీలోకి అనువాదమయ్యాయి. 1992లో బాలకృష్ణ ‘రౌడీ ఇన్ స్పెక్టర్’ హిందీలో డబ్ అయి సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం! ఇక నందమూరి నటవంశం మూడోతరం హీరో అయిన జూనియర్ నటించిన అనేక సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయి, అలరించాయి. గత యేడాది పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’తో జూనియర్ మరింతగా ఉత్తరాదివారిని ఆకట్టుకున్నారు. సదా తన తాతను స్మరిస్తూ ఆయన బాటలోనే పయనిస్తున్నానని చెప్పుకొనే జూనియర్ యన్టీఆర్ మరి హిందీలో నటించబోయే తొలి చిత్రంతో ఏలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.