Nithya Menen: మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా, సింగర్ గా, నిర్మాతగా పలు పంగల్లో రాణిస్తున్న ఈ చిన్నది ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్యన తెలుగులో భీమ్లా నాయక్ లో పవన్ సరసన నటించి మెప్పించిన నిత్యా సూపర్ సింగర్ షో లో జడ్జిగా కనిపించి మెప్పించింది.ఇక గ్లామర్ పాత్రలకు నో అంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకొని మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తిరు చిత్రంలో మంచి విజయాన్ని అందుకొంది. ధనుష్ సరసన నటించి మెప్పించిన నిత్యా ఈ సినిమా ప్రమోషన్స్ లో తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. మొదటి నుంచి నిత్యాకు పొగరు ఉందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. సెట్ లో ఎవరితో మాట్లాడదని, ఏమైనా మాట్లాడినా పొగరుగా సమాధానం చెప్తుందని చాలాసార్లు చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందించింది.
“మొదటి నుంచి నాకు పొగరు అని చిత్ర పరిశ్రమలో పేరు ఉంది. అయితే అందులో నిజం లేదు. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. వారికి నచ్చినట్టు నేను చేయకపోయేసరికి నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మన ఎదుగుదలను చూడలేని వారు.. ఎలాగైనా మనల్ని కిందకు లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు నాతో నటించినవారెవ్వరు నాతో పనిచేయడం కష్టమని చెప్పలేదు. కానీ నేను ఎదుగుతున్నాను అని అనుకున్నవారు మాత్రమే నాపై లేనిపోని నిందలు వేసి నన్ను కిందకు దించాలని చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక నిత్యా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిత్యాను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్న వారు ఎవరు అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.