జూన్ లో వస్తున్న ఈ నాలుగో శుక్రవారం తెలుగు సినిమాలు చాలానే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. విశేషం ఏమంటే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కొండా మురళీ, సురేఖ బయోపిక్ ‘కొండా’ గురువారం రోజే విడుదలైంది. గత కొన్ని నెలలుగా వర్మ చిత్రాల విడుదలకు చెక్ పెడుతూ వస్తున్న నట్టికుమార్ ఇప్పుడు అతనితో చేతులు కలపడంతో ‘కొండా’ విడుదలకు మార్గం సుగమం అయ్యింది.
ఇక శుక్రవారం మరో ఎనిమిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’, కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’, సుమంత్ అశ్విన్ ‘7 డైస్ 6 నైట్స్’, లక్ష్య చదలవాడ ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అందులో కాస్తంత చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా ‘పెళ్ళికూతురు పార్టీ’, ‘కరణ్ అర్జున్’, ‘సాఫ్ట్ వేర్ బ్లూస్’, ‘సదా నన్ను నడిపే’ వంటి సినిమాలూ తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి. వీటితో పాటే ఈ నెల 24న విడుదల కావాల్సిన ‘గాంధర్వ’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ చిత్రాలు జూలై 1వ తేదీకి వాయిదా పడ్డాయి. అవి కూడా వచ్చి ఉంటే ఈ వీక్ రిలీజెస్ సంఖ్య డబుల్ నంబర్ కు చేరేది!
