New Controversy iin Tollywood Over Movie Shootings: తెలుగు చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని పరిష్కరించేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి సినిమా చిత్రీకరణల్ని నిలిపివేస్తూ ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే! తొలుత తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి వ్యతిరేకత ఎదురైనా, ఆ తర్వాత వాళ్లు ప్రొడ్యూసర్ గిల్డ్‌కి మద్దతు తెలిపారు. అయితే.. ఇప్పుడు ఈ వ్యవహారంపై మరో కొత్త వివాదం తెరమీదకొచ్చింది. ఫిలిం ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి, ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్స్ ఆపేస్తారని అనుకుంటే.. కొన్ని చిత్రబృందాలు అందుకు భిన్నంగా యధావిధిగా చిత్రీకరణలు నిర్వహించాయి. అవే.. ‘వారసుడు’, ‘సార్’ యూనిట్స్!
దీంతో.. ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు సీరియస్ అయ్యారు. సమస్యల పరిష్కారం కోసం బంద్‌కు పిలుపునిచ్చినా.. ఇలా ఎలా షూటింగ్స్ కొనసాగిస్తారని మండిపడుతున్నారు. మరోవైపు.. బంద్ విషయంపై తమకు ఎలాంటి లేఖ అందలేదని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ కార్మికులు షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. తద్వారా, ఇండస్ట్రీలో గందరగోళ వాతావరణం నెలకొంది. చిన్న సినిమాలతో పాటు చివరి దశలో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలిపివేయాలని పిలుపునిచ్చినప్పటికీ.. అందుకు భిన్నంగా షూటింగ్ కొనసాగించడంపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సంతోషంగా లేరని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మరి, ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.