Site icon NTV Telugu

Tollywood: ఎట్టకేలకు ఎఫ్‌.డి.సి.కి కొత్త ఛైర్మన్!

FDC Chairman

FDC Chairman

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సినీ, టెలివిజన్, థియేటర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌ కు కొత్త ఛైర్మన్ ను నియమించింది. టీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ. సెల్ వ్యవస్థాపకులు అనిల్ కుమార్ కూర్మాచలం ను ఎఫ్‌.డి.సి. ఛైర్మన్ గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన్ పదవి కాలం పూర్తి అయ్యి చాలా యేళ్ళు గడిచినా ఈ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. త్వరలో తెలంగాణాలోనూ సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఛైర్మన్ పదవిని భర్తీ చేసిందనే మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే… కరీంనగర్ జిల్లా రాంనగర్ కు చెందిన అనిల్ కుమార్ కూర్మాచలం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ప్రస్తుతం యు.కె.లో ఐటీ కన్సెల్టెంట్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విదేశాలలో ఉన్న తెలంగాణీయులను ఒక్క త్రాటిపైకి తీసుకురావడానికి అనిల్ విశేష కృషి చేశారు. కొవిడ్ సమయంలోనూ యూకేలో అక్కడి తెలంగాణ వాసులకు విశేష సేవలు అందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణతో పాటు వికాసం విషయంలోనూ అనుభవం ఉన్నందునే అనిల్ కుమార్ కు ఎఫ్.డి.సి. ఛైర్మన్ పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా ఉత్తర్వులు వెలువడిన వెంటనే అనిల్ కుమార్ మంగళవారం ప్రగతి భవన్ కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు.

Exit mobile version