నిన్నటివరకూ తిరుగులేని స్ట్రీమింగ్ సంస్థగా అగ్రస్థానంలో కొనసాగిన నెట్ ఫ్లిక్స్‌కి ఇప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు వరుసగా జారుకుంటున్నారు. తన వినియోగదార్లను తిరిగి రప్పించుకునేందుకు ఎన్ని ప్రణాళికలు అమలు చేసినా, ప్రయోజనం లేకుండా పోతోంది. ఇతర ఓటీటీ సంస్థల్లాగే ఇది కూడా దిగొచ్చి, తక్కువ రేట్లకే సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చినా, ఫలితం మాత్రం శూన్యం. తన మార్గదర్శకాల్ని సవరించినప్పటికీ.. తేడా కనిపించలేదు. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ నిలిచిపోవడంతో పాటు యూజర్ గ్రోత్ చాలా నెమ్మదిగా ఉంది.
ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 150 మంది ఉద్యోగులపై వేటు వేసింది. తమ రెవెన్యూ బాగా నెమ్మదించడం వల్ల, తమ కంపెనీ కాస్ట్ గ్రోత్‌ని తగ్గించుకోవడం కోసం 150 మంది ఉద్యోగుల్ని తొలగించాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది. వ్యక్తిగత పనితీరుని బట్టి తాము ఈ నిర్ణయం తీసుకోలేదని, ఆర్థిక లావాదేవీల దృష్ట్యా వారిని తీసేయాల్సి నెట్ ఫ్లిక్స్ స్పోక్స్ పర్సన్ తెలిపారు. అలాంటి గొప్ప సహోద్యోగుల్ని పంపించాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, కానీ మరో మార్గం లేదని ఆయనన్నారు. కాగా.. ఈ ఏడాది మొదటి క్వార్టర్‌లో నెట్ ఫ్లిక్స్ 2 లక్షల సబ్‌స్కైబర్స్‌ని కోల్పోయింది. దశాబ్దం తర్వాత ఇలాంటి పెద్ద దెబ్బని ఈ సంస్థ ఎదుర్కొంది. మరో మూడు నెలల్లో ఆ సంఖ్య 20 లక్షలకు చేరుకోవచ్చని అంచనాలున్నాయి.
గత నెలలోనూ నెట్ ఫ్లిక్స్ సంస్థ తన ఎంటర్టైన్‌మెంట్ సైట్ టుడుమ్ కోసం పని చేస్తోన్న ఎందరో అనుభజ్ఞులైన జర్నలిస్టుల్ని, రైటర్స్‌ని తొలగించింది. షాకింగ్‌కి గురి చేసే విషయం ఏమిటంటే.. ఆ వెబ్‌సైట్‌ని నెట్‌ఫ్లిక్స్ గతేడాది డిసెంబర్‌లోనే లాంచ్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం.. దాదాపు ఆ సైట్ కోసం పని చేసే మొత్తం టీమ్‌నే నెట్ ఫ్లిక్స్ తొలగించిందట! అంతేకాదు, తమ కంపెనీ ఉద్యోగులకు తమకు నచ్చని కంటెంట్‌పైనా పని చేయాల్సిందేనని సూచించింది. పలు రకాల కంటెంట్ టైటిల్స్ హానికరమని భావించినా, విధులు నిర్వర్తించాల్సిందేనంటూ తెగేసి చెప్పింది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే, స్వచ్ఛందంగా బయటకు వెళ్ళిపోవచ్చని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దీన్ని బట్టి, నెట్‌ఫ్లిక్స్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.