Site icon NTV Telugu

Bellamkonda Ganesh: ఐ ఫోన్ దొంగిలించి, గణేశ్ ను ట్రాప్ చేసింది ఎవరు!?

Nenu

Nenu

Nenu Student Sir: తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ నటిస్తున్న మలి చిత్రం ‘నేను స్టూడెంట్ సర్!’. ప్రముఖ దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘నాంది’ సతీశ్ వర్మ దీనిని నిర్మిస్తున్నారు. బెల్లంకొండ గణేశ్ సరసన అలనాటి నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని హీరోయిన్ గా నటిస్తోంది. శనివారం ఈ మూవీ టీజర్ విడుదలైంది. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఐ ఫోన్ ను కొనుకున్న గణేశ్… ఆ వెంటనే దాన్ని పోగొట్టుకుంటాడు. పోలీస్ కమీషనర్ ను కలిసి తన ఫోన్ కొట్టేసింది పోలీసులే అని కంప్లయిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. స్టూడెంట్ అయిన గణేశ్‌ ను ప్రీ ప్లాన్డ్ గా ఎవరో ట్రాప్ చేశారని మిత్రులు అనుమానిస్తారు. స్టూడెంట్ అయిన గణేశ్ వేలు ఖర్చు పెట్టి ఐఫోన్ కొనడం ఏమిటీ? దాన్ని పోగొట్టుకోవడం ఏమిటీ? ఎవరిదో ఫోన్ అతనికిచ్చి కేసు క్లోజ్ చేస్తామని పోలీసులు చెప్పడం ఏమిటీ? దీని వెనుక ఉన్న మిస్టరీ ని తెలుసుకోవాలంటే మూవీని చూడాల్సిందే! అంతటి ఆసక్తిని ఈ టీజర్ కలిగిస్తోంది. ‘నాంది’తో కథాబలం ఉన్న సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సతీశ్ వర్మ ఇప్పుడూ అలాంటి కథనే ఎంచుకున్నాడని అర్థమౌతోంది. అలానే లవర్ బోయ్ ఇమేజ్ కోసం తాపత్రయపడకుండా, నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి బెల్లంకొండ గణేశ్ ప్రయత్నిస్తున్నాడనీ ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.

‘నేను స్టూడెంట్ సర్!’ టీజర్ ఆవిష్కరణ అనంతరం ముఖ్య అతిథి వినాయక్ మాట్లాడుతూ, ”సతీష్ గారు తీసిన ‘నాంది’ సినిమాను చూశాను. ఎక్కడా రాజీ పడకుండా మంచి కంటెంట్ తో దాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే సంస్థలో గణేష్ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. టీజర్ చాలా బావుంది. ఈ సినిమాతో గణేష్ కి మరో విజయం రావాలని కోరుకుంటున్నాను. అవంతిక తన తల్లి భాగ్యశ్రీలానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. హీరో బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ, ”’స్వాతిముత్యం’ సినిమా విడుదల కాకముందే నన్ను నమ్మి ఇంత ఖర్చు చేసి ‘నేను స్టూడెంట్ సర్’ చిత్రాన్ని నిర్మించిన సతీష్ గారికి కృతజ్ఞతలు. కథని బలంగా నమ్మితేనే ఇలాంటి సినిమాలు చేయగలుగుతాం. కథలో విషయం వుంది కాబట్టే నేనూ యాక్సప్ట్ చేశాను. రాఖీ ఉప్పలపాటి లాంటి అంకిత భావంతో పని చేసే దర్శకుడు దొరకడం మా అదృష్టం. అవంతిక దస్సాని చాలా చక్కగా నటించింది. అసలు ఆమె తెలుగు అమ్మాయి కాదనే భావనే రాదు. ఇందులో రవి శివతేజతో నేను చేసే కామెడీ చాలా బాగా పండుతుందని నమ్ముతున్నాను” అని చెప్పారు. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉందని, టీజర్ ఎంత ఇంట్రస్టింగ్ గా ఉందో సినిమా కూడా అలానే ఉంటుందని నిర్మాత సతీశ్ వర్మ తెలిపారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథను సమకూర్చారని, కళ్యాణ్ చక్రవర్తి సంభాషణలు రాశారని, అందరి సహకారంతో అనుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కించానని దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తెలిపారు.

తన తల్లి భాగ్యశ్రీని దక్షిణాది చిత్రసీమ ఎంతో ప్రేమతో ఆదరించిందని, అదే ఆదరణ తనకూ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నానని, ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని హీరోయిన్ అవంతిక దస్సాని చెప్పింది. జెమినీ సురేష్, రవి శివతేజ, శశి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సముతిర ఖని, సునీల్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోదిని తదితరులు పోషించారు. మణిశర్మ తనయుడు మహతీ స్వర సాగర్ ఈ చిత్రానికి స్వర రచన చేశారు.

Exit mobile version