Nayanthara: నయనతార ఏది చేసినా నయనానందమే కాదు, శ్రవణానందం ఆ పై ఆసక్తి కలిగిస్తూ ఉంటాయి. నయనతార ప్రేమాయణాలు ఒకప్పుడు వినడానికి వీనులు ఇంతింత చేసుకొనేవారు జనం. ఈ యేడాది జూన్ 9న తాను వలచిన విఘ్నేశ్ శివన్ ను మనువాడింది నయన్. అక్టోబర్ లోనే తమకు సరోగసీ ద్వారా కవల పిల్లలు పుట్టారని ప్రకటించింది. దాంతో మరింత సంచలనం సృష్టించింది. అసలు సరోగసీ ద్వారా అయినా, అంత త్వరగా ఎలా పుట్టారని కొందరు నీతిమంతులు నిలదీస్తే, మరికొందరు కోర్టులో నయన్ దంపతులపై వ్యాజ్యం కూడా వేశారు. అలా కూడా వార్తల్లో నిలచిన నయన్ వైపే తీర్పు వెలువడింది. ఇలా నయనతార ఏది చేసినా విశేషంగా మారుతోంది. అవును మరి, దక్షిణాదిన నయన్ నంబర్ వన్ హీరోయిన్. ఆమె చేసే ప్రతి పనీ ఫ్యాన్స్ కు ముచ్చట గొలుపుతూ ఉంటాయి. నయన్ పెట్టే షరతులను సైతం అంగీకరిస్తూ సినీజనం ఆమె డేట్స్ కోసం పరుగులు తీస్తున్నారు. దీనిని బట్టే నయనతార మ్యాజిక్ ఏ పాటిదో ఊహించవచ్చు.
నయనతార అసలు పేరు డయానా మరియమ్ కురియన్. 1984 నవంబర్ 18న బెంగళూరులో జన్మించారామె. మళయాళ కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ లో పనిచేయడం వల్ల పలు చోట్ల చదువు సాగింది. ఉత్తరాదిన చదువుకున్న నయన్, తమ కేరళలోని మర్తోమా కాలేజ్ లో ఇంగ్లిష్ లిటరేచర్ లో డిగ్రీ పూర్తి చేశారు. తరువాత నటనపై ఆసక్తితో సాగిన నయన్ ‘మనస్సినక్కరే’ అనే మళయాళ చిత్రంద్వారా తెరకు పరిచయమయ్యారు. తరువాత తమిళంలో ‘అయ్యా’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా ‘పెద్దాయన’ పేరుతో తెలుగులో అనువాదమయింది.
ఆ పై వచ్చిన అనువాద చిత్రం ‘చంద్రముఖి’లో నయన్ అందం తెలుగువారికి బంధాలు వేసింది. తెలుగులో వెంకటేశ్ తో వి.వి.వినాయక్ తెరకెక్కించిన ‘లక్ష్మీ’ చిత్రంలో తొలిసారి నటించారు. ఆ తరువాత నాగార్జున ‘డాన్’లోనూ, వెంకటేశ్ ‘తులసి’లోనూ నటించేసి అలరించారు నయన్. బాలకృష్ణతో నయనతార నటించిన ‘సింహా’ అనూహ్య విజయం సాధించింది. తరువాత బాలయ్యతో నయన్ నటించిన “శ్రీరామరాజ్యం, జై సింహా” చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. ‘శ్రీరామరాజ్యం’లో సీతమ్మగా నటించిన నయనతారకు ఉత్తమ నటిగా నంది అవార్డు లభించింది. బాబాయిలతోనూ, అబ్బాయిలతోనూ సందడి చేసిన నాయికగా నయన్ కు పేరుంది. వెంకటేశ్ సరసన నటించిన నయన్, తరువాత ఆయన అన్న కొడుకు రానాతోనూ ‘కృష్ణం వందే జగద్గురుమ్’లో నటించి మురిపించారు. ఇక బాలయ్య సరసన భళా అనిపించిన నయన్, జూనియర్ యన్టీఆర్ తోనూ ‘అదుర్స్’లో అదరహో అనేలా నటించారు.
టాప్ స్టార్స్ తోనూ, యంగ్ స్టార్స్ తోనూ నయనతార తనదైన పంథాలో అలరించారు. ఇక తమిళనాట యాక్షన్ డ్రామాస్ లోనూ నటించేసి ఆకట్టుకుంటున్నారు. ఓ నాటి విజయశాంతిలా నయన్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించేస్తున్నారు. ఆమెపై రూపొందే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్, తమిళ స్టార్ హీరోస్ స్థాయిలో వసూళ్ళు రాబట్టడం విశేషం. అందువల్లే నయన్ ఎలాంటి కండిషన్స్ పెట్టినా, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం పరుగులు తీస్తూనే ఉన్నారు. చిరంజీవితో ‘సైరా…నరసింహారెడ్డి’లో సిద్ధమ్మగా నటించిన నయనతార, ‘గాడ్ ఫాదర్’లో మెగాస్టార్ కు చెల్లెలిగా అభినయించారు. షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తోన్న ‘జవాన్’లోనూ నయన్ నటించారు. దీంతో పాటు నాలుగు తమిళ, నాలుగు మళయాళ చిత్రాల్లోనూ ఆమె నటించడానికి అంగీకరించారు. రాబోయే చిత్రాలతోనూ నయన్ మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.