సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్ 28న సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, సూపర్ హీరోయిన్ సమంత కలసి నటించిన ‘కన్మణి రాంబో ఖతిజ’ (కే.ఆర్.కే) చిత్రం రిలీజ్ అవుతోంది.
మెగాస్టార్ స్థాయి హీరోతో నయనతార సినిమాను పోల్చడం ఏంటి అంటారా? కాదేదీ పోటీకి అనర్హం! చరిత్రలోకి తొంగిచూస్తే మహానటుడు నటరత్న యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ విడుదలయిన రోజునే నాటి యాక్షన్ క్వీన్ విజయలలిత నటించిన ‘రౌడీ రాణి’జనం ముందు నిలిచింది. యన్టీఆర్ సినిమా సూపర్ హిట్ కాగా, ‘రౌడీ రాణి’ సైతం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఇక 1985 అక్టోబర్ 11న నాటి సూపర్ స్టార్ కృష్ణ చిత్రం ‘సూర్యచంద్ర’, అప్పటి క్రేజీ స్టార్ బాలకృష్ణ ‘కత్తుల కొండయ్య’తో పాటే విజయశాంతి ‘ప్రతిఘటన’ కూడా విడుదలయింది. ఏ సినిమా ఏ స్థాయిలో అలరించిందో అందరికీ తెలుసు. అందువల్ల హీరోయిన్స్ నటించిన సినిమాలను, స్టార్ హీరోల చిత్రాలతో పోటీ అనడం సబబు కాదని చెప్పలేం.
సరే ఇప్పటి విషయానికి వస్తే – జనాల్లో ఎంతో క్రే్జ్ ఉన్న నయనతార, సమంత తొలిసారి కలసి నటిస్తున్నారు. అందువల్ల ‘కేఆర్.కే’కు క్రేజ్ లేకపోలేదు. అది తమిళ డబ్బింగ్ మూవీ కాబట్టి, తెలుగునాట నయన్, సమ్ముకు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమాపై కూడా అంతో ఇంతో క్రేజ్ ఉండక పోదు. కానీ, తమిళనాడులో మాత్రం నయన్, సమ్ము కాంబోకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంది.దాంతో అక్కడ ఆ సినిమా ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అలాగే తొలిసారి పూర్తి స్థాయిలో చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలసి ‘ఆచార్య’లో నటించారు. ఇందులో రామ్ చరణ్ పాత్ర కేవలం 45 నిమిషాలే తెరపై కనిపిస్తుందని తెలుస్తోంది. అయినప్పటికీ ఆ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందని సమాచారం!దాంతో ఈ సినిమాకు ఆరంభం నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. మరి ఏప్రిల్ 28న వచ్చే ‘కే.ఆర్.కే’ ఏ తీరున సాగుతుందో? ఏప్రిల్ 29న జనం ముందు నిలిచే ‘ఆచార్య’ ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.