ప్రముఖ కథానాయిక నిత్యామీనన్ నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది. విశ్వక్ ఖండేరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ ”రెండేన్నరేళ్ల జర్నీ ఈ సినిమా. అనేక చర్చలు జరిపి, ఆ తర్వాతే సినిమాను స్టార్ట్ చేశాం. విశ్వక్‌కు స్టోరీపై అద్భుతమైన గ్రిప్ ఉంది. పృథ్వీకి చిత్ర నిర్మాణంలో క్లారిటీ ఉంది. పొలాలు, డబ్బులు ఇవేమీ విలువైనవి కావు. హ్యుమన్ వ్యాల్యూస్ ముఖ్యమని ఈ సినిమాలో చూపించాం. మా బ్యానర్ వ్యాల్యూస్ ను నిలబెట్టే చిత్రమవుతుందని నమ్మకంగా ఉన్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు మా సినిమాను సక్సెస్ చేస్తారని భావిస్తున్నాం” అని అన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 28వ తేదీ నిర్వహించబోతున్నారు. దీనికి నేచురల్ స్టార్ నాని ముఖ్యఅతిథిగా హాజరవుతున్నాడు. నిత్యామీనన్ తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’లో నాని హీరోగా నటించాడు. అప్పటి నుండీ కొనసాగుతున్న అనుబంధంతో పాటు నిత్యా మొదటిసారి నిర్మాత కావడంతో నాని ఈ వేడుకకు హాజరవుతున్నాడని అనుకోవచ్చు. అలానే నాని నిర్మించిన ‘అ’ చిత్రంలోనూ నిత్యామీనన్ ఓ కీలక పాత్రను పోషించింది.