వినోదభరిత చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు. అలాంటి సినిమాల్లో హీరోలు కొత్తవారా, పాతవారా అనే విషయాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. కథానుగుణంగా నటీనటుల ఉన్నారా లేదా అనే చూస్తారు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘జాతి రత్నాలు’ చిత్రం. ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘నటరత్నాలు’ సినిమా తెరకెక్కబోతోంది.
బుల్లితెర వీక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఆ తర్వాత వెండితెరపైకి వచ్చిన ‘రంగస్థలం’ మహేశ్; తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న సుదర్శన్ నట శిక్షకుడు వైజాగ్ సత్యానంద్ శిష్యుడు అర్జున్ తేజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్. ఎస్. నాగేశ్వరరావు నిర్మించబోతున్నారు. గాదె నాగభూషణం దర్శకత్వం వహించే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్ష బాధ్యతలు నర్రా శివనాగ నిర్వర్తిస్తున్నారు. ఆనందాసు శ్రీమణికంఠ దీనికి సహ నిర్మాత.
డాక్టర్ భద్రం, తమిళ నటుడు శేషాద్రి ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా క్రైం, థ్రిల్లర్, మిస్టరీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. జూన్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేస్తామని తెలిపారు.