AHA: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2 జోర్దార్ గా సాగిపోతోంది. గత శుక్ర, శనివారాల్లో జడ్జెస్ ప్లే లిస్ట్ ఛాలెంజ్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా సాగాయి. తమన్ స్వర పరిచిన పాటలను కొందరు; కార్తీక్, గీతా మాధురి పాడిన పాటలను మరికొందరు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మొదటి రోజు షోకు ‘దాస్ కా ధమ్కీ’ ఫేమ్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ అతిథులుగా హాజరయ్యారు. వీళ్ళ తాజా చిత్రం థియేటర్లలో పెద్దంత సందడి చేయకపోయినా… ఆహా ఓటీటీలో మాత్రం విశేషంగా వీక్షకుల ఆదరణను పొందింది. దాంతో ఉత్సాహంగా ఈ జోడీ తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొంది. మొదటి రోజు కార్తికేయ ‘ఆరెంజ్’ సినిమాలోనూ, సాకేత్ ‘అ…ఆ’ సినిమాలోనూ కార్తీక్ పాడిన పాటలను పాడి వినిపించారు. కంటెస్టెంట్ కార్తికేయ తనకు ఎంతో ఇష్టమైన సింగర్ అని చెబుతూ, నివేదా పేతురాజ్ ఈ కుర్రాడితో సెల్ఫీ దిగింది. అలానే దేవిశ్రీ ప్రసాద్, కార్తికేయను అప్రిషియేట్ చేస్తూ మరో వీడియో పంపించాడు. 14 సంవత్సరాల అయ్యన్ ప్రణతి ‘దిగు దిగు దిగు నాగ… ‘ పాట పాడగా, ఎన్.ఆర్.ఐ. శ్రుతి ‘మహానుభావుడు’ మూవీ టైటిల్ సాంగ్ తనదైన శైలిలో పాడి అందరి అభినందనలు అందుకుంది. తనకు పానీపూరి తినడం ఇష్టమని ఆమె చెప్పడంతో వేదిక మీదకే పానీపూరి బండిని తీసుకొచ్చి, ఎవరు ఎక్కువ తింటారనే కాంపిటీషన్ పెట్టడంతో శ్రుతి, గీతామాధురి జోడీ అందులో విన్ అయ్యింది.
రెండో రోజు షోకు ‘అన్నీ మంచి శకునములే’ హీరోహీరోయిన్లు సంతోష్ శోభన్, మాళవిక నాయర్, దర్శకురాలు నందిని రెడ్డి స్పెషల్ గెస్ట్స్ గా హాజరయ్యారు. సౌజన్య ‘గాయం -2’లోని పాట పాడి అలరించి, బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. బి.ఎస్.ఎఫ్. జవాన్ కమ్ సింగర్ చక్రపాణి ‘బిల్లా’లోని వేర్ ఈజ్ ద పార్టీ పాటను పాడాడు. జయరాం ‘వాన’లోని మెలోడీ గీతాన్ని అత్యద్భుతంగా పాడి బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాడు. చివరగా లాస్యప్రియ ‘గోలీమార్’ కోసం గీతా మాధురి పాడిన ‘మగాళ్ళు వట్టి మాయగాళ్ళే’ గీతాన్ని ఆలపించి బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రారంభంలో కార్తీక్ ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్ సాగ్ పాడగా, అందులోని మరో పాటను మాళవిక నాయర్ గానం చేసింది. చివరిలో ప్రణతి, సాకేత్, శ్రుతి బాటమ్ 3లో ఉండగా, ఆడియెన్స్ ఓట్లను బట్టి… షో నుండి సాకేత్ నిష్క్రమించాడు. ఈ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి న్యాయనిర్ణేతలు ఛాన్స్ ఇచ్చారు. అలా వైజాగ్ కు చెందిన హితేష్ సాయి షోలోకి అడుగుపెట్టాడు. మరి ఈ కొత్త కుర్రాడు రాబోయే రోజుల్లో ఇప్పటికే బరిలో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కు ఎలాంటి పోటీ ఇస్తాడో చూడాలి.