Nandamuri Balakrishna Prestigious Project Stopped In 2001: ఇప్పుడు భారత చిత్రసీమలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోందంటే.. దానికి ‘బాహుబలి’నే కారణం. ఉన్నత ప్రమాణాలతో హాలీవుడ్ సినిమాల్ని తలదన్నే రీతిలో దర్శకధీరుడు రాజమౌళి ఆ సినిమాని రూపొందించడంతో.. అది కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా చిత్రాలకు బీజం వేసింది. ఇలాంటి తరుణంలో.. లేటెస్ట్‌గా గతంలో ఆగిపోయిన ఓ సినిమా ప్రస్తావన ఇప్పుడు మళ్లీ తెరమీదకి వచ్చింది. అది నందమూరి బాలకృష్ణ సినిమా కావడంతో, మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆగిపోయిన ఆ సినిమా మరేదో కాదు, విక్రమసింహా భూపతి. ఒకవేళ ఈ సినిమా రూపొంది ఉండి ఉంటే.. మనకు 2001లోనే ఇది ‘బాహుబలి’ రేంజ్ సినిమా అయ్యుండేదని చెప్పుకుంటున్నారు.
ఇంతకీ ఆ సినిమా కథ ఏమిటంటే.. ప్రతాప వర్మ (బాలయ్య – తనయుడి పాత్ర) తన నానమ్మతో కలిసి ఓ అడవిలోని గూడెంలో నివసిస్తుంటారు. ఒకరోజు కొందరు బందిపోటు దొంగలు.. ఆ గూడాన్ని దోచుకోవడానికి వస్తారు. వాళ్ళు ప్రతాప వర్మని చూసి ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. దోచుకోవడానికి వచ్చిన బందిపోటు దొంగలు, ఆయన్ను కీర్తించడం మొదలుపెడతారు. అప్పుడే ప్రతాప వర్మకు తన గతం గురించి తెలుస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో విక్రమ సింహ భూపతి (బాలయ్య – తండ్రి పాత్ర) ఓ సామ్రాజ్యానికి రాజు. అతని కుమారుడే ప్రతాప వర్మ. నమ్మినవాళ్లే విక్రమ సింహ భూపతిని వెన్నుపోటు పొడిచి హతమారుస్తారు. ఆ పరిస్థితుల్లో విక్రమ సింహ భూపతి తల్లి తన మనవడ్ని తీసుకొని, అడవిలోకి వెళ్లిపోతుంది. ఇలా తన తండ్రి గురించి తెలుసుకున్న ప్రతాప వర్మ తిరిగి.. తిరిగి ఆ రాజ్యానికి వెళ్తాడు. తన తండ్రి చావుకి కారణమైన వాళ్లని శిక్షించి, తిరిగి సింహాసనాన్ని దక్కించుకుంటాడు.
దాదాపు బాహుబలి కథనే పోలి ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను 2001లో ప్రారంభించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించాలని నిర్మాతలు నిర్ణయించారు. రెండు పాటలు సహా కొంత భాగం చిత్రీకరణ కూడా జరిగింది. ఇందులో కథానాయికల పాత్రల కోసం రోజా, అంజలా జవేరి, పూజా బాత్రాలను తీసుకున్నారు. బామ్మ పాత్రకు కేఆర్ విజయను తీసుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఈ చిత్ర నిర్మాత గోపాల్ రెడ్డి కొన్ని సెంటిమెంట్ల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ని ఆపేశారు. ఇంతలో బాలయ్య ఇతర సినిమాల్లో బిజీ అవ్వడం, నిర్మాత గోపాల్ రెడ్డి కూడా అనారోగ్యానికి గురవ్వడంతో.. ‘విక్రమసింహా భూపతి’ పూర్తిగా ఆగిపోయింది. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఉంటే.. ఆరోజుల్లోనే ఇది బాహుబలి రేంజ్ సినిమా అయ్యుండేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.