ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘బంగార్రాజు’ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారు. నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేశారు. ఇటీవలే నాగ చైతన్య సైతం సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో వెండితెరపైకి రానుంది అనేది తాజా సమాచారం. అయితే విషయం ఏమిటంటే ‘బంగార్రాజు’ సాహసం బాగానే ఉంది… కానీ రిస్క్ చేస్తున్నాడా ? అని అనుమాన పడుతున్నారు కొందరు. ఎందుకంటే సంక్రాంతి బరిలో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7న, ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ప్రమోషన్స్ లో కూడా రెండు చిత్రబృందాలు ఒక అవగాహనతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే మధ్యలో ఉన్న ‘భీమ్లా నాయక్’ను పక్కకు తప్పించారు. మరోవైపు పెరుగుతున్న కరోనాతో పాటు ఒమిక్రాన్ కూడా భారీ చిత్రాల మేకర్స్ ను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ‘బంగార్రాజు’ విడుదల కావడం అంటే రిస్క్ కదా మరి !
కాగా నాగార్జున మరో రెండు రోజుల్లో ‘బంగార్రాజు’కు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను విడుదల చేయబోతున్నారని సమాచారం. ‘బంగార్రాజు’ జనవరి 15న వెండితెరపైకి రానున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ప్రచారం చేసేందుకు సంబంధిత పోస్టర్‌ను విడుదల చేయనున్నారట. ఇదే గనుక నిజమైతే ‘భీమ్లా నాయక్’ పోటీని ‘బంగార్రాజు’ భర్తీ చేయనున్నాడు. ఇంతకుముందు ‘భీమ్లా నాయక్’ జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా, ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు ‘బంగార్రాజు’ ‘రాధేశ్యామ్’ జనవరి 14న విడుదల కానుండగా, ఇప్పుడు దానికి పోటీగా జనవరి 15న ‘బంగార్రాజు’ రాబోతున్నాడని అంటున్నారు. మరి ఈ పర్ఫెక్ట్ పండగ మూవీని మేకర్స్ సంక్రాంతి బరిలో నిలిపితే గనుక ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి.