Nagarjuna Releasing Sardaar Telugu Dubbing Version In Telugu States: మన సీనియర్ తెలుగు నిర్మాతలు ఇప్పుడు డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయడం మీద దృష్టి పెట్టారు. ‘దిల్’ రాజు లాంటి వాళ్లు గత కొంతకాలంగా ఈ పని చేస్తూనే ఉన్నారు. చిత్రం ఏమంటే ‘దిల్’ రాజు నిర్మాతగా మారిందే మణిరత్నం ‘అమృత’ సినిమాతో. ఆ తర్వాతే అతను స్ట్రయిట్ చిత్ర నిర్మాతగా ‘దిల్’ తో సూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్నాడు. పంపిణీ రంగంలో బలంగా పాతుకుని పోయిన కారణంగా ఇప్పటికీ పక్క రాష్ట్రాల నిర్మాతలు తమ డబ్బింగ్ మూవీస్ ను ‘దిల్’ రాజు ద్వారా విడుదల చేయించాలని చూస్తుంటారు. అలా తాజాగా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ ను కూడా ‘దిల్’ రాజే తెలుగులో రిలీజ్ చేశారు.
ఇక విషయానికి వస్తే… ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి (హీరో నితిన్ తండ్రి) ఆ మధ్య కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాను తెలుగులో పంపిణీ చేసి, ఘన విజయాన్ని అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘విక్రమ్’ మూవీ కమల్ కెరీర్ లో మైలురాయిగా నిలవడమే కాదు… ఈ యేడాది ‘కేజీఎఫ్-2’ తర్వాత తెలుగులో అంతటి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘విక్రమ్’ ద్వారా సుధాకర్ రెడ్డి పొందిన ఆనందం ఆ తర్వాత తన కుమారుడుతో తీసిన ‘మాచర్ల నియోజకవర్గం’ పరాజయంతో కొంత ఆవిరి అయినా… ‘విక్రమ్’ తెలుగు పంపిణీదారుడిగా సుధాకర్ రెడ్డిని ఓ మంచి పొజిషన్ లో నిలిపింది.
సరిగ్గా ఇప్పుడు అదే ఆనందాన్ని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా పొందుతున్నారు. గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆయన గతంలో కొన్ని పరభాషా చిత్రాలను పంపిణీ చేశారు, కానీ అవి వేళ్ళ మీద లెక్కించేవే! చాలా కాలం తర్వాత ఆయన చొరవ చూపించి కన్నడ సినిమా ‘కాంతార’ను తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా కన్నడంలో మాదిరిగానే తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దిగ్విజయంగా ప్రదర్శితమౌతోంది. ఈ మధ్య జీఏ 2 సంస్థ నుండి వచ్చిన ‘పక్కా కమర్షియల్’ ఫ్లాప్ ను ‘కాంతార’ మూవీ విజయంతో ఆయన మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… ఇప్పుడు అదే బాటలో నాగార్జున కూడా నడిస్తారేమో అనిపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్న నాగార్జున అడపా దడపా బయటి చిత్రాలనూ పంపిణీ చేస్తుంటారు. కానీ ఎప్పుడూ భారీ చిత్రాల జోలుకు పోలేదు. కానీ ‘ఊపిరి’ మూవీలో తనతో కలిసి నటించిన కార్తీతో ఏర్పడిన అనుబంధం కారణంగా, అతని తాజా చిత్రం ‘సర్దార్’ ను తెలుగులో విడుదల చేసే బాధ్యతలను నాగార్జున స్వీకరించారు. ఈ సినిమా ఈ నెల 21న దీపావళి కానుకగా విడుదల అవుతోంది. మరి మొన్న సుధాకర్ రెడ్డి, నిన్న అల్లు అరవింద్ అందుకున్న విజయాన్ని ‘సర్దార్’ ద్వారా నాగార్జున కూడా అందుకుంటారేమో చూడాలి.