Custody: అక్కినేని ఫ్యామిలీకి కొద్ది కాలంగా బాక్సాఫీస్ బరిలో ఎదురు గాలలు వీస్తున్నాయి. నాగార్జున, నాగచైతన్య, అఖిల్… ముగ్గురూ కూడా గ్రాండ్ సక్సెస్ కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. భిన్నమైన కథాంశాలను ఎంచుకున్నా… అభిమానులు, ప్రేక్షకులు వారి సినిమాలు చూసి పెదవి విరుస్తున్నారు. మొన్న అఖిల్ ‘ఏజెంట్’ను, తాజాగా నాగచైతన్య ‘కస్టడీ’ని కూడా ప్రేక్షకులు మెచ్చలేదు. బట్… కమర్షియల్ సక్సెస్ ను పక్కన పెడితే… అక్కినేని నాగార్జున ‘గీతాంజలి’ మూవీకి నాగచైతన్య ‘కస్టడీ’కి కొన్ని పోలికలు ఉన్నాయి.
నాగార్జున నటించిన ‘గీతాంజలి’ మూవీకి తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఆయనకు తెలుగులో అదే మొదటి సినిమా. అలానే నాగచైతన్య ‘కస్టడీ’ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఇదే ఆయనకు తెలుగులో మొదటి సినిమా. ఇక ‘గీతాంజలి’కి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించగా, ‘కస్టడీ’కి ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కూడా జత కలిశాడు. ‘గీతాంజలి’ సినిమా విడుదలైన మే 12వ తేదీనే నాగచైతన్య ‘కస్టడీ’ కూడా విడుదలైంది. బట్… ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయి. నాగార్జున కెరీర్ లో ‘గీతాంజలి’ ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచింది. ‘కస్టడీ’ యాక్షన్ మూవీ కావడంతో దర్శక నిర్మాతలతో సహా అందరూ ఈ సినిమాను నాగార్జున ‘శివ’తో పోల్చారు. ఈ సినిమాకు అసలు అదే పేరు పెట్టాలని అనుకున్నామనీ చెప్పారు. కానీ ఇది అటు ‘శివ’… ఇటు ‘గీతాంజలి’ అనిపించుకోలేకపోయింది. యాక్షన్ సీన్స్ బాగున్నాయని కొందరు చెబుతున్నా, శరత్ కుమార్, అరవింద స్వామి ముందు స్క్రీన్ పై నాగచైతన్య తేలిపోయాడనే అంటున్నారు. ఏదేమైనా ‘గీతాంజలి’ రిలీజ్ రోజునే వచ్చిన ‘కస్టడీ’ అక్కినేని అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.