Chandrababu: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ విజయ నగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు ప్రేమకథను పుస్తకంగా తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్ళు పాటు పరిశోధన చేసి ఆయన ‘నాగలాదేవి’ పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. ఈ గ్రంథ రచనను అభినందిస్తూ తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తన ఇంటిలో దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నాలుగు దశాబ్దాలకు పైగా జర్నలిస్టు భగీరథ నాకు తెలుసు. ఇది ఆయన రాసిన 11వ పుస్తకం. తిరుపతి సమీపంలోని నాగలాపురం అనే పల్లెటూరుకు చెందిన నాగలాదేవిని శ్రీకృష్ణదేవరాయలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత ఆమె పేరును చిన్నాదేవిగా మార్చాడు. అయితే చిన్నాదేవి, నాగలాదేవి వేరు వేరు అనే వాదన ఒకటి ప్రచారంలో ఉంది. కానీ భగీరథ గారు లోతైన పరిశోధన చేసి, వారిద్దరూ ఒక్కరేనని ఈ పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటారు” అని అన్నారు. శ్రీకృష్ణదేవరాయలు నాగలాదేవిని వివాహం చేసుకోడానికి పది సంవత్సరాలు పట్టిందని, ఆ తరువాత నాగలాదేవి జీవనయానం ఎలా సాగింది? భర్తకు ఆమె ఏ విధంగా సహకరించింది? అనేది ఈ పుస్తకంలో భగీరథ అద్భుతంగా రచించారని చంద్రబాబు నాయుడు చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భగీరథ రెండు పర్యాయాలు ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డు, ఎన్.టి.ఆర్. మెమోరియల్ ట్రస్టు అవార్డు స్వీకరించారని చంద్రబాబు తెలిపారు.
‘నాగలాదేవి’ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని రచయిత భగీరథ చెప్పారు. ఈ సందర్భంగా రచయిత భగీరథను చంద్రబాబు నాయుడు సత్కరించారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడును రచయిత భగీరథ కుమార్తెలు శైలి జాస్తి , శ్రుతి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీ మోహన్, నిర్మాత డి.వి.కె. రాజు, తెలుగుదేశం నాయకులు టి.డి. జనార్దన్, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని భగీరథను అభినందించారు.