Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!

Nag Chaitanya

Nag Chaitanya

Nag Chaitanya: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య పాల్గొని మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అఖిల్ నటన, నాగార్జున ధైర్యం, దర్శకుడు కిషోర్ నందు ప్రతిభపై ప్రశంసలు కురిపించారు. “కొంచెం ఆలస్యంగా వచ్చినా అఖిల్‌కు మీరు అద్భుతమైన ప్రేమ, సపోర్ట్ ఇచ్చారని అక్కినేని అభిమానులతో అన్నారు. ప్రతి ఈవెంట్‌లో మీ ఎనర్జీ చూసి చాలా సంతోషంగా ఉంది” అని చెప్పారు. అఖిల్ గురించి మాట్లాడుతూ.. “అఖిల్ హీరో అయ్యాడు అనిపించింది సినిమా విడుదలైన తర్వాత కాదు.. ‘లెనిన్’ కథను ఒప్పుకున్న రోజే. ఈ కథ నాకు ముందే తెలుసు. కథ విన్నప్పుడు ఇలాంటి పాత్ర చేయాలంటే 20-25 సినిమాల అనుభవం కావాలని నాకు అనిపించింది. కానీ తన వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను అఖిల్ అద్భుతంగా సొంతం చేసుకున్నాడు. స్క్రిప్ట్ అంగీకరించిన రోజే అతడు నా హీరో అయ్యాడు. అన్నయ్యగా, ప్రేక్షకుడిగా, అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తండ్రి నాగార్జున గురించి కూడా నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాన్న ఎప్పుడూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ‘శివ’, ‘గీతాంజలి’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడతా’ వంటి సినిమాలు చేయడానికి కారణం అదే ధైర్యం. ‘లెనిన్’ కథ విన్నప్పుడు కూడా ఇది చాలా పెద్ద కథ, కాంప్లెక్స్ రోల్ అని నేను చెప్పాను. కానీ ‘చేసి చూపిస్తా’ అన్న నాన్న ఆత్మవిశ్వాసమే నాకు ఎప్పుడూ స్ఫూర్తి” అని పేర్కొన్నారు. నిర్మాత వంశీని ప్రశంసిస్తూ.. “ఒక హీరోను ఎలా ప్రజెంట్ చేయాలో వంశీకి బాగా తెలుసు. అదే అఖిల్‌కు ఇచ్చాడు. దర్శకుడు కిషోర్ నందు కూడా తన రెండో సినిమాతోనే అద్భుతమైన ప్రతిభ చూపించాడు. ‘లెనిన్’లో క్లైమాక్స్‌తో పాటు విలన్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు నాకు చాలా నచ్చాయి. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. ఆ నటన వెనుక దర్శకుడి విజన్ స్పష్టంగా కనిపించింది” అని కొనియాడారు. అలాగే సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ భాగ్యశ్రీ, నటీనటులందరి నటనను నాగచైతన్య ప్రత్యేకంగా అభినందించారు. చివరగా “ఎన్ని సినిమాలు చేసినా అఖిల్ నాకు ఎప్పటికీ చిన్న సిసింద్రీనే. ఐ లవ్ యూ బ్రదర్… నీ విజయం చూసి చాలా గర్వంగా ఉంది” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగచైతన్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.