Naga Chaitanya Remuneration For Laal Singh Chaddha: ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘లాల్ సింగ్ చడ్డా’లో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే! ఈ సినిమా ద్వారానే అతడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. బాలరాజు అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఆమిర్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలోనే.. నాగ చైతన్య ఈ సినిమాకి గాను ఎంత పారితోషికం తీసుకున్నాడన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగులో నాగ చైతన్య ఒక్కో చిత్రానికి గాను రూ. 8 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్ ఉంది. మరి, లాల్ సింగ్ చడ్డాకి ఎంత తీసుకున్నాడన్న దానిపై ఆరా తీస్తే.. రూ. 5 కోట్ల వరకు అందుకున్నట్టు తేలింది. అతని పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ, ప్రభావితం చేసేలా ఉంటుందట! అందుకే, అతనికి అంత రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే, నాగ చైతన్యకు హిందీలోనూ వరుస అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అతని మార్కెట్ తప్పకుండా పెరుగుతుందన్నమాట!
కాగా.. రీసెంట్‌గా నాగ చైతన్య నుంచి తెలుగులో ‘థ్యాంక్యూ’ సినిమా రాగా, అది బోల్తా కొట్టేసింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాష చిత్రం చేస్తున్నాడు. అలాగే.. ‘డీజే టిల్లు’ సినిమాతో సత్తా చాటిన విమల్ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు ‘దూత’ అనే వెబ్ సిరీస్‌తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.