Naa Desham: నలభై ఏళ్ళ ‘నా దేశం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Desham:”‘మనదేశం’ అంటూ చిత్రసీమలో ప్రవేశించి, అందరితోనూ పనులు చేయించుకొని, ఇప్పుడు ‘నా దేశం’ అంటూ రాజకీయాల్లోకి వస్తున్నాడు యన్టీఆర్. అంటే ఆయనది ఎంత స్వార్థపూరితమైన బుద్ధో తెలిసిపోతోంది” అంటూ ఆ నాటి కాంగ్రెస్ నాయకులు యన్టీఆర్ ను విమర్శించారు. ఎందుకంటే, ‘నా దేశం’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకముందే యన్టీఆర్ 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి, ప్రచార పర్వమూ మొదలు పెట్టారు. అందువల్ల కాంగ్రెస్ నాయకులు, యన్టీఆర్ ను ఏ విధంగానైనా ప్రజల్లో చులకన చేయాలన్న భావనతో ఆయనపై పలు పలు విధాలా విమర్శలు చేశారు. కొందరు యన్టీఆర్ క్యాస్ట్యూమ్స్ ను ఇంటికి ఎత్తుకుపోతారనీ అన్నారు. మరికొందరు, ఆయన మేకప్ తుడిచే టవల్స్ ను కూడా పట్టుకుపోతారనీ సెలవిచ్చారు. ఇవన్నీ సదరు నిర్మాతలను, మేకప్ ఆర్టిస్టులను అడిగే యన్టీఆర్ తీసుకుపోయే వారు. ఆ విషయాలు సదరు నాయకులకూ తెలుసు. కానీ, యన్టీఆర్ ను రాజకీయాల్లో ఎలాగైనా కించపరచాలన్నదే వారి ధ్యేయం. కాబట్టి అలాగే నోరు పారేసుకొనేవారు. అలా షూటింగ్ మొదలైన దగ్గర నుంచీ జనం నోళ్ళలో నానుతూ ‘నా దేశం’ చిత్రం కేవలం 19 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. 1982 అక్టోబర్ 27న దసరా కానుకగా ‘నా దేశం’ జనం ముందు నిలచి, జయకేతనం ఎగురవేసింది.
‘నా దేశం’ చిత్రానికి హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన ‘లావారిస్’ ఆధారం. చివరలో క్లయిమాక్స్ ను యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీ సిద్ధాంతాలకు అనువుగా మలచి తెరకెక్కించారు. అందుకు పరుచూరి బ్రదర్స్ రచన, కె.బాపయ్య దర్శకత్వం వన్నె తెచ్చాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం, ప్రముఖ నిర్మాత కె.దేవీవరప్రసాద్ సంయుక్తంగా తమ ‘పల్లవీ దేవీ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించారు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
‘నా దేశం’ కథ విషయానికి వస్తే – రచయిత్రి సరస్వతీదేవిని ప్రతాపరావు నమ్మించి, మోసం చేస్తాడు. ఓ బిడ్డకు జన్మనిచ్చి సరస్వతీదేవి కన్నుమూస్తుంది. ఆ బిడ్డను కైలాసం అనే తాగుబోతు పెంచుతాడు. ఆ బాబు భరత్ అనే పేరు పెట్టుకుంటాడు. అతని సంపాదనతో కైలాసం తాగుతూ కాలం వెళ్ళబుచ్చుతుంటాడు. ఓ రోజున భరత్ కు తానో అనాథ అని తెలుస్తుంది. ఆ సమయంలోనే డబ్బున్న ప్రతాపరావు కొడుకుతో పరిచయం ఏర్పడుతుంది. అతని ద్వారా ప్రతాపరావును కలుసుకున్న భరత్ అతను చెప్పిన పని చేస్తుంటాడు. ప్రతాపరావు స్నేహితుని కూతురు మోహిని. ఆమెతో భరత్ కు తొలుత పోట్లాట మొదలయి, అది ప్రేమగా మారుతుంది. చివరకు తన కన్నతల్లి ఓ రచయిత్రి అని, ఆమెను ప్రతాపరావు మోసం చేశాడని తెలుస్తుంది. ప్రతాపరావు కొడుకు కూడా తండ్రిలాగే ఓ అమ్మాయిని గర్భవతిని చేసి మోసం చేయాలని చూస్తాడు. దాంతో వారిని భరత్ ఎదిరిస్తాడు. అందువల్ల భరత్ ను మట్టుపెట్టాలని చూస్తారు. వారిని ఎదిరించి, కన్నతండ్రిని, తమ్ముడిని, కాబోయే మామను కట్టేసి వారికి ఏ శిక్ష విధించమంటారో చెప్పమని జనం మధ్యకు తీసుకుపోతాడు భరత్. మీరే మీ విచక్షణతో ఈ దుష్టత్రయానికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించమని కోరతాడు. విధించండి శిక్ష అంటూ భరత్ ఎలుగెత్తి చాటుతూ ఉండగా సినిమా ముగుస్తుంది.
ఇందులో యన్టీఆర్ సరసన జయసుధ నాయికగా నటించారు. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, గిరిబాబు, పద్మనాభం, శివకృష్ణ, జమున, కాంచన, రాజ్యలక్ష్మి, రోహిణీ, కృష్ణవేణి, కాకినాడ శ్యామల, మాస్టర్ హరీశ్, బేబీ మీనా, సిల్క్ స్మిత, పి.యల్.నారాయణ, చలపతిరావు, పి.జె.శర్మ, సుత్తివేలు కనిపించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు పలికించారు. ఇందులోని “ఉన్నాడురా ఆ దైవము.. ఉంటాడురా నీ కోసము..”, “నేనొక నెత్తురు దీపం..”, “రోజులన్నీ మారే..”, “చల్లాపల్లిలో చల్లనమ్మే..”, “ప్రేమకు పేరంటమూ..”, “ఈ చెంప ముద్దందిరో..” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రంలో అడుగడుగున యన్టీఆర్ పార్టీ సిద్ధాంతాలను అనువుగా పలికించడం భలేగా సాగింది.
‘నా దేశం’ చిత్రం సమయానికి యన్టీఆర్ రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. అయినా తన నిర్మాతలకు ఇచ్చిన మాట కోసం యన్టీఆర్ ముగ్గురు నిర్మాతలకు కలిపి, ఒకే సినిమాకు కాల్ షీట్స్ ఇచ్చారు. వారిలో ఒకరు ఆయనతో అంతకు ముందు ‘యమగోల’ వంటి సూపర్ డూపర్ హిట్ తీసిన యస్. వెంకటరత్నం, మరొకరు ఆయనతో ‘కథానాయకుని కథ, కేడీ నంబర్ వన్, తిరుగులేని మనిషి” తెరకెక్కించిన కె.దేవీవరప్రసాద్. మరో నిర్మాతకు ఈ ఇద్దరూ కలసి కొంత పైకం ఇచ్చి, ఆయన భాగాన్ని కూడా తామే పంచుకొనేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ సినిమా కోసం యన్టీఆర్ 16 రోజులు పనిచేశారు. రోజుకు రూ.1.5 లక్షల చొప్పున రూ.24 లక్షలు యన్టీఆర్ పారితోషికం పుచ్చుకున్నారు. అప్పట్లో కేవలం 16 రోజులకు అంత మొత్తం పుచ్చుకున్న నటుడు భారతదేశంలోనే లేరు. 19 రోజుల్లో ఈ సినిమా పూర్తయింది. అదే యేడాది యన్టీఆర్ నటించిన ‘జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి’ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ సినిమాల ప్రభంజనం కొనసాగుతూ ఉండగానే ‘నా దేశం’ జనం ముందుకు వచ్చింది. పైగా యన్టీఆర్ రాజకీయ సిద్ధాంతాలు కూడా ఈ సినిమాలో చోటు చేసుకోవడంతో జనం భలేగా ఈ చిత్రాన్ని ఆదరించారు. రన్నింగ్ పరంగా ‘బొబ్బిలిపులి’ స్థాయిలో ప్రదర్శితం కాకున్నా, ఓపెనింగ్స్ లో ‘నా దేశం’ సంచలనం సృష్టించింది. అప్పట్లో కోటి రూపాయలకు పైగా పోగేసిందీ చిత్రం. ‘బొబ్బిలిపులి’ దాదాపు నాలుగు కోట్లు, ‘జస్టిస్ చౌదరి’ రెండు కోట్లు పోగేయగా, ఈ సినిమా కూడా కోటి రూపాయలకు పై చిలుకు మొత్తాన్ని చూడడం కనీవినీ ఎరుగని చరిత్రగా నిలచింది. ఇందులోని డైలాగ్స్ లో యన్టీఆర్ తన పార్టీ భావాలను పొందుపరచడం వల్ల ‘తెలుగుదేశం’ పార్టీ ఘనవిజయంలో ఈ సినిమా పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు. యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత నటించిన చివరి చిత్రంగా ‘నా దేశం’ చరిత్రలో నిలచింది. ఆ తరువాత మళ్ళీ’బ్రహ్మర్షి విశ్వామిత్ర’ కోసం కెమెరా ముందుకు వచ్చారాయన. మధ్యలో విడుదలైన యన్టీఆర్ చిత్రాలు అంతకు ముందు రూపొందినవే! ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లో నటించారాయన. తరువాత ప్రతిపక్ష నేతగా ఉన్న సమయాన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు, మేజర్ చంద్రకాంత్’ చిత్రాల్లో అభినయించారు యన్టీఆర్.
ఆయన నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. అయితే చివరగా విడుదలైన సినిమా ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. రామారావు రాజకీయ ప్రవేశం చేశాక నటించిన చివరి చిత్రం ‘నా దేశం’లోనూ, ఆయన నటజీవితంలో చివరగా విడుదలైన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’లోనూ జయసుధ నాయిక కావడం విశేషం!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!