Site icon NTV Telugu

Amigos: 30 రోజుల్లో మైత్రీ మూవీ మేకర్స్ హ్యాట్రిక్!?

Amigos

Amigos

Kalyan Ram: మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రారంభించినప్పుడు వరుసగా ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ ను సాధించింది. ఆ తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. తిరిగి ‘ఉప్పెన’, ‘పుష్ప’, ‘సర్కారు వారి పాట’తో మరోసారి హ్యాట్రిక్ ను ఈ సంస్థ అందుకుంది. మొదటి హ్యట్రిక్ తర్వాత ఎలాగైతే కొన్ని పరాజయాలను అందుకుందో, సెకండ్ హ్యాట్రిక్ తర్వాత కూడా మూడు పరాజయాలను చవిచూసింది. అయితే ఈ యేడాది ప్రారంభంలోనే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ జైత్ర యాత్ర మొదలెట్టింది. జనవరి 11న వచ్చిన బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’, 12న విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ను అందుకుంది. ఆ ఊపుతోనే ఇప్పుడు 30 రోజులు గడవకముందే ముచ్చటగా మూడో చిత్రం ‘అమిగోస్’ను ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

నందమూరి కళ్యాణ్‌ రామ్ ‘అమిగోస్’ మూవీలో మూడు భిన్నమైన పాత్రలతో జనాలను మెప్పించబోతున్నాడు. రెండు దశాబ్దాల క్రితమే షార్ట్ ఫిల్మ్ మేకర్ గా అవార్డులను అందుకుని, ఆపైన ‘వలయం’ అనే ఫీచర్ ఫిల్మ్ ను తెరకెక్కించిన రాజేంద్ర రెడ్డి ‘అమిగోస్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రం ఏమంటే ‘అమిగోస్’ అనేది ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సొంత నిర్మాణ సంస్థ పేరు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుండి జనాలలో ఆసక్తిని కలిగిస్తున్న ‘అమిగోస్’ కోసం నందమూరి బాలకృష్ణ ‘ధర్మక్షేత్రం’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ…’ అనే పాటను రీమిక్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలానే కళ్యాణ్ రామ్ గత చిత్రం ‘బింబిసార’ చక్కని విజయాన్ని అందుకోవడం, మైత్రీ మూవీ మేకర్స్ తిరిగి సక్సెస్ ట్రాక్ మీదకు రావడం ‘అమిగోస్’ కు కలిసొచ్చే అంశాలు. ఈ సినిమాలో ఏమాత్రం కొత్తదనం ఉన్నా తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఖాయం. ఇప్పటికే విడుదలైన సినిమా పాటలు, ప్రచార చిత్రాలను చూస్తుంటే ఆ కళ ‘అమిగోస్’లో స్పష్టంగా కనిపిస్తోంది. సో… నెల రోజుల వ్యవథిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధించే ఆస్కారం ఉంది. అదే జరిగే… మైత్రీ మూవీ మేకర్స్ తన జర్నీలో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించినట్టు!!

Exit mobile version