డాన్స్ మాస్టర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్ కంపోజ్ చేసి ప్రశంసలు అందుకున్న ప్రభుదేవా ఆ తర్వాత నటుడి, దర్శకుడిగానూ తన సత్తాను చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభు దేవా ప్రధానపాత్రలో ‘మై డియర్ భూతం’ అనే సినిమా తెరకెక్కుతోంది. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ గా ఈ మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి. పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ.ఎన్. బాలాజీ దీన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా తాజాగా ‘మై డియర్ భూతం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుంది. ‘జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని, ఈ మేకోవర్ నాచురల్‌గా ఉండాలని ఎంత కష్టపడ్డారో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన లుక్ చూస్తే అర్థమౌతుందని, ఈ లుక్ కోసం ప్రభుదేవా ఎలాంటి విగ్ వాడకపోవడం విశేషమని నిర్మాత రమేశ్ పిళ్ళై తెలిపారు. ప్రభుదేవా క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను కలిగిస్తుందని దర్శకుడు రాఘవన్ అన్నారు. ఇందులో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. దీనికి డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటించనున్నారు.