Koti: ఆ రేంజ్ పాటలు ఇప్పుడు ఎవరూ కొట్టలేరు.. ఇది నా ఛాలెంజ్!

Koti 50

Koti 50

తెలుగు సినీ సంగీత చరిత్రలో 80, 90వ దశకం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజ్-కోటి. ఆ తర్వాత సోలోగా కూడా వందలాది బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు కోటి. తన అద్భుతమైన స్వరాలతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కోటి, సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక భారీ లైవ్ కాన్సర్ట్‌కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్‌ను ప్రముఖ రాజకీయ నేత, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోమవారం గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ వేదికపై కోటి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

గత ఐదు దశాబ్దాల తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న కోటి, నాటి సంగీతానికి, నేటి ట్రెండ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. “నేను ప్రతి సినిమాను, ప్రతి పాటను నా మొదటి అవకాశంగానే భావించి కష్టపడ్డాను. తరతరాలు గుర్తుండిపోయేలా పని చేశాను. రాజ్-కోటిగా, ఆ తర్వాత సోలోగా నేను ఇచ్చిన పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. కానీ ఇప్పుడు అలాంటి పాటల్ని, ఆ బీట్స్‌ను ఎవ్వరూ క్రియేట్ చేయలేరని నేను ఛాలెంజ్ చేయగలను” అని కోటి ధీమాగా చెప్పారు. చిరంజీవి గారి బ్రేక్ డ్యాన్స్‌కు తమ బీట్స్ తోడైతే అప్పట్లో పూనకాలు వచ్చేవని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లోనే తాను ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించేవాడినని, తన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన ఏఆర్ రెహమాన్, దేవీశ్రీ ప్రసాద్, థమన్, హారిస్ జయరాజ్.. నేడు ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదగడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. నవంబర్ 28న జరిగే తన కాన్సర్ట్‌కు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా ఇండస్ట్రీ అంతా కదలివచ్చి విజయవంతం చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. నవంబర్ 28న ఈ మెగా లైవ్ కాన్సర్ట్ జరగనుంది.