Music Director Chakri: కుర్రకారును కిర్రెక్కించే బాణీలతో భలేగా సాగారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. అప్పట్లో చక్రి సంగీతంలో రూపొందిన వందలాది గీతాలు సంగీత ప్రియులను అలరించాయి. జూన్ 15న చక్రి జయంతి. ఈ సందర్భంగా చక్రి స్వరయాత్రను గుర్తు చేసుకుందాం. పిన్నవయసులోనే కన్నుమూసిన చక్రి స్వరపరచిన బాణీలను ఈ నాటికీ ఎందరో స్మరించుకుంటూనే ఉన్నారు. యూత్ ను ఉర్రూతలూగిస్తూ చక్రి ట్యూన్స్ కట్టారు. అందుకు తగ్గట్టుగానే గీత రచయితలు
తమ కలాలను కవాతు చేయించారు. యువత కదం తొక్కేలా చక్రి స్వరవిన్యాసాలు సాగాయి. సరిగమలతో సావాసం చేస్తూ పదనిసలతో పరుగులు తీయడం చక్రికి వెన్నతో పెట్టిన విద్య. కేవలం సంగీత దర్శకునిగానే కాదు పాటగాడిగానూ చక్రి ఎన్నో సార్లు అలరించారు.
తెలంగాణలో కంబాలపల్లిలో జన్మించిన చక్రి పిన్న వయసులోనే సప్తస్వరసాధన చేశారు. ఆరంభంలో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్, భక్తి గీతాలు స్వరపరచి చిత్రసీమలో అవకాశాల కోసం వెదుకులాట మొదలెట్టారు. ఆ సమయంలో పూరి జగన్నాథ్ తన ‘బాచి’ చిత్రంతో చక్రిని సంగీత దర్శకునిగా నిలిపారు. అంతే కాదు ఆ తరువాత కూడా భలేగా ప్రోత్సహించారు. ఆపై ఇతరులు సైతం చక్రికి అవకాశాలు కల్పించారు. ప్రతి అవకాశాన్నీ చక్రి సద్వినియోగం చేసుకున్నారు. చక్రిని టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిపిన చిత్రం పూరి జగన్నాథ్ ‘ఇడియట్’. ఈ సినిమాలో చక్రి బాణీలకు ఆ రోజుల్లో కుర్రకారు సీట్లలో కుదురుగా కూర్చోలేక పోయారు. పాటల
కోసమే ‘ఇడియట్’ను పదే పదే చూసిన వారూ ఉన్నారు. దీనిని బట్టే చక్రి సంగీతం ‘ఇడియట్’కు ఎంతలా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. చక్రి ట్యూన్స్ లో మహత్తు తెలిశాక స్టార్ హీరోస్ సైతం ఆయన సంగీతంపై ఆసక్తి చూపించారు. తన దరికి చేరిన ప్రతీ సినిమాను కొత్తగానే భావించి, చక్రి బాణీలు కట్టేవారు. అదే ఆయనను అనతి కాలంలోనే అందరిలోకి ప్రత్యేకంగా నిలిపింది. చక్రిని ఎందరో దర్శకనిర్మాతలు అభిమానించారు. ఆయన బాణీలతోనే కలసి సాగారు. చక్రి సైతం శక్తివంచన లేకుండా తనను అభిమానించేవారికి, ఆదరించేవారికీ సంతృప్తి కలిగిస్తూ సంగీతం సమకూర్చారు. అలా ఎంతోమంది అభిమాన గణాలను సంపాదించారు. చక్రి భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన ఫ్యాన్స్ మాత్రం చక్రి జయంతికి ఏదో ఒక సామాజిక సేవాకార్యక్రమం చేస్తూ ఆనందిస్తున్నారు. ఈనాటికీ చక్రి సంగీతం సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది.