‘సీతారామం’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో చక్కటి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావటంతో అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే మృణాల్ కోటి కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో కొన్ని ఆఫర్‌లు తనకి దూరంగా జరుగుతున్నాయి. మృణాల్ కి ‘సీతారామం’ వంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన వైజయంతీ మూవీస్ లోనే తన తదుపరి సినిమా చేయబోతోందట.
ఇప్పటి వరకూ టీవీ సీరియల్స్ తో పాటు మరాఠీ సినిమా ‘విట్టిదండు’, ‘సూరజ్యా’, బాలీవుడ్ లో ‘లవ్ సోనియా’, ‘సూపర్ 30’, ‘బాట్లా హౌస్’,’తూఫాన్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ వంటి సినిమాల్లో నటించిన మృణాల్ నెట్ ప్లిక్స్ వారి ‘ఘోస్ట్ స్టోరీస్’లోనూ నటించింది. ఇక జాన్ అబ్రహాంతో కలసి ‘గల్లన్ గోరియా’ అనే మ్యూజిక్ వీడియో కూడా చేసింది. అయితే ‘సీతారామం’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. నటిగా ప్రతిభావంతురాలైన ఈ బ్యూటీ లేడీఓరియెంటెడ్ సినిమాను చేయబోతోందట. తనపై ఎంతో నమ్మకం ఉంచిన వైజయంతీ సంస్థ దీనిని నందిని రెడ్డి దర్శకత్వం లో రూపొందించనున్నట్ల సమాచారం. ఇక మృణాల్ బాలీవుడ్‌లో ‘పిప్పా, ఆంఖ్ మిచోలి, గుమ్ రాహ్, పూజ మేరీజాన్’ అనే వరుస సినిమాలు చేస్తోంది. అంతే కాదు ఓటీటీలో కూడా రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘లస్ట్ స్టోరీస్’ కావటం విశేషం. ఇలా వరుస ఆఫర్స్ పలకరిస్తుండటంతోనే ఇప్పుడు మృణాల్ కోటి పాట అందుకున్నట్లు టాక్. మరి మునుమందు ఈ సీత ఎలాంటి సినిమాలతో అలరిస్తుందో చూడాలి.