Mrunal Thakur Finalised For Vijay Devarakonda- Parasuram Film: సీతారామం సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది మృణాల్ ఠాకూర్. నిజానికి హిందీ టెలివిజన్ పరిశ్రమ ద్వారా ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి పరిచయమైన ఈ భామ తర్వాత మరాఠీ సినిమాల ద్వారా హీరోయిన్గా మారింది. ముందుగా మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సీతారామం అనే సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీతామహాలక్ష్మి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు హిందీలో అలాగే ఇతర భాషల్లో సైతం సూపర్ హిట్ గా నిలవడంతో ఈ భామకు తెలుగు సహా ఇతర భాషల్లో సినిమా అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ నుంచి సౌత్ కి తన మకాం మార్చేసి మరిన్ని సినిమా అవకాశాలు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ భామకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పటికే నాని హీరోగా నటిస్తున్న నాని 30వ సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయింది. కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం రావడంతో ఆమె లక్కు బాగుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె తెలుగులో మరో బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ఆమె విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. విజయ్ దేవరకొండ కెరియర్లో 13వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించబోతున్నారు.
అదే సినిమాలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు హైదరాబాదులో జరగబోతున్నాయి. నిజానికి ఈ సినిమాలో పూజా హెగ్డేను నటింప చేయమని విజయ్ దేవరకొండ దర్శక నిర్మాతలు కోరినట్లు వార్తలు వచ్చాయి. జనగణమన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది కానీ ఆ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు లేకపోవడంతో ఆమెను ఈ సినిమాకి ఎంపిక చేయమని కోరగా దర్శక నిర్మాతలు మాత్రం మృణాల్ ఠాకూర్కే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి రేపు పూజా కార్యక్రమాలు జరగడంతో రేపు అధికారికంగా ఈ మేరకు ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.