Site icon NTV Telugu

ఏజ్ ను పాజ్ లో పెట్టిన మమ్ముట్టి!

mammooty

mammooty

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వయసు ఎంతో మీకు తెలుసా?! 70 సంవత్సరాలు!! చిత్రం ఏమంటే… ఆయనతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఎంతో మంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు, మరి కొందరు సినిమా రంగం నుండే తప్పుకున్నారు. మమ్ముట్టిని ఇప్పటికీ 70 సంవత్సరాల వ్యక్తిగా అంగీకరించడానికి ఎవరి మనసూ ఒప్పుకోదు. ఇటీవల మమ్ముట్టి తాను డిగ్రీ చదివిన ఎర్నాకులం మహారాజా కాలేజీ రీ-యూనియన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అతని క్లాస్ మేట్స్ తో కలిసి కొన్ని ఫోటోలు దిగాడు. మమ్ముట్టి వాళ్ళందరిలోకి చిన్నవాడిగా కనిపించడమే కాదు… వాళ్ళకు జూనియర్ అనిపించేలా ఉన్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఓ పక్క హీరోగా రాణిస్తుంటే… అతనికే మమ్ముట్టి సినిమాలు పోటీఇచ్చేలా ఉన్నాయి. చిత్రసీమలోకి 1971లో జూనియర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన మమ్ముట్టి ‘దేవలోకం’ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘భీష్మ పర్వం, పుజు, నన్పకల్ నేరతు మయక్కమ్’ సినిమాలలో నటిస్తున్నాడు. అలానే సీబీఐ సీరిస్ లో చివరిదైన ఐదవ భాగం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మమ్ముట్టిని చూస్తుంటే… వయసును ఓ 30 సంవత్సరాల క్రితమే అతను పాజ్ లో పెట్టేశాడేమో అనిపిస్తుంది!

Exit mobile version