Site icon NTV Telugu

అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు

Mohan Babu and Manchu Vishnu Meets Balakrishna

‘మా’ ఎన్నికలు, వాటి తదనంతర ఫలితాలు, కొత్త ప్యానెల్ సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించడం, ఓడిపోయిన ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేయడం మరియు ఇతరులు రాజీనామా చేయడం తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పరిణామాల మధ్య మంచు విష్ణు తన తండ్రితో కలిసి వెళ్ళి నందమూరి బాలకృష్ణను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘మా’ ఫలితాల తరువాత తొలిసారిగా బాలకృష్ణను కలిశారు మంచు తండ్రీకొడుకులు. ఎన్నికలకు ముందు బాలకృష్ణ మంచు విష్ణుకే తాను సపోర్ట్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చెప్పినట్టుగానే మంచు విష్ణుకే ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు విష్ణు, మోహన్ బాబు… బాలయ్యను కలిశారు.

Read Also : “మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ “అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. గెలుపుకు సహకరించిన అందరినీ కలుస్తాను. ఇప్పటికే కోట శ్రీనివాసరావు, పరుచూరి బ్రదర్స్ ను కలిశాను. ప్రకాష్ రాజ్ ప్యానల్ ను కలుపుకునే వెళ్తా. రాజీనామాల విషయానికొస్తే మీటింగ్ పెట్టి ఈసీ మెంబర్ల అభిప్రాయం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటాను. చిరంజీవిని కూడా కలుస్తాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక బాలయ్యతో ఉన్న ఫోటోను షేర్ చేసిన మంచు విష్ణు “నాకు సపోర్ట్ చేసిన బాల అన్నకు ధన్యవాదాలు. కలుసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆయన కూడా ‘మా’ కోసం ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చడంపై దృష్టి పెట్టమని నాకు సలహా ఇచ్చాడు. ఇదే ప్రస్తుతం నా ఎజెండా” అంటూ ట్వీట్ చేశారు.

మోహన్ బాబు మాట్లాడుతూ “షిర్డీ సాయి, కనక దుర్గ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఇప్పుడు బాలయ్య ఇంటికి ఎందుకు వచ్చానంటే ఆయన ఓటు వేశారని కాదు, సంస్కారం కోసం. గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి ప్రచారం చేశాను. మంగళగిరిలో టీడీపీ ఓడిపోయింది. అయినా కూడా అన్నీ మర్చిపోయి, నేను ఫోన్ చేసి కలుద్దాం అనగానే ఓకే చెప్పారు బాలయ్య. అది సంస్కారం అంటే…” అంటూ మంచు విష్ణుకు సపోర్ట్ చేసినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version