ఇటీవల విడుదలైన ‘ద కాశ్మీర్ ఫైల్స్’లో నటించిన మిథున్ చక్రవర్తి తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో ఇటీవల బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. మిథున్ చక్రవర్తికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మిథున్ అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం మిథున్ ‘ఫిట్ అండ్ ఫైన్’ గా ఉన్నట్లు అతని పెద్ద కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి అలియా మిమో చక్రవర్తి తెలియచేశారు. మిథున్ హాస్పిటల్ బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా షేర్ చేస్తూ ‘త్వరగా కోలుకోండి మిథున్ దా’ అని అన్నారు. తొలి చిత్రం ‘మృగయా’తోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మిథున్ కు ‘డిస్కో డాన్సర్’తో వెనుదిరిగి చూసుకునే అవసరం కలగలేదు. ఇటీవల కాలంలో మిథున్ తన దృష్టిని టెలివిజన్‌పై పెట్టాడు. డాన్స్ రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.