రాహుల్ విజయ్, మేఘా ఆకాశ్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న చిత్ర బృందం ఇటీవల మలి షెడ్యూల్ కోసం గోవా వెళ్ళింది. అక్కడే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టేసింది. ఈ చిత్రానికి మేఘా ఆకాశ్ తల్లి బిందు ఆకాశ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండటం విశేషం.
కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మించిన ఈ సినిమాను అభిమన్యు బుద్ధి డైరెక్ట్ చేశాడు. నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథను అందించాడు. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ ప్రేమకథా చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుందని, చక్కని ప్యాడింగ్ ఆర్టిస్టులు తమకు లభించారని, సినిమా టైటిల్ తో పాటు అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.