Varuntej Birthday: మెగా ఫ్యామిలీలో అసలైన ‘ఆరడుగుల బుల్లెట్’ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంతకు ముందు విజయపథంలో పయనించిన వరుణ్ తేజ్, గత ఏడాది ‘గని’తో నిరాశకు గురయ్యాడు, తరువాత వచ్చిన ‘ఎఫ్-3’తో కాసింత ఊరట చెందాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న వరుణ్‌కు ఈ సినిమాపై బోలెడు ఆశలు ఉన్నాయి.
Read Also: Kajol Devgan: భర్త లేనప్పుడు అతడితో కాజోల్ లిప్ కిస్.. మరీ నాలుగుసార్లా..?
వరుణ్ తేజ్ 1990 జనవరి 19న జన్మించాడు. చిన్నతనం నుంచి చుట్టూ సినిమా వాతావరణమే. తండ్రి, పెదనాన్న, చిన్నాన్న అందరూ నటులే. దాంతో చిన్నతనంలోనే వరుణ్‌కు కూడా నటించాలన్న అభిలాష సహజంగానే కలిగింది. బాలనటునిగా తండ్రి నటించిన ‘హ్యాండ్సప్’లో కనిపించాడు. 2014లో ‘ముకుంద’తో యంగ్ హీరోగా జనం ముందు నిలిచాడు వరుణ్ తేజ్. ‘ముకుంద’ చిత్రంలో వైవిధ్యం కనిపిస్తుంది. అయితే హీరో, హీరోయిన్ ఇద్దరి మధ్య మూగప్రేమ సాగడమే జనానికి అంతగా నచ్చలేదు. దాంతో ఆశించిన విజయం దక్కలేదు. తరువాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘కంచె’ మూవీ నటుడిగా మంచి మార్కులు సమకూర్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఆపై వచ్చిన ‘లోఫర్’, ‘మిస్టర్’ కూడా అంతగా ఆకట్టుకోలేక పోయాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ నిజంగానే జనాన్ని ఫిదా చేసింది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. వరుణ్ తేజ్ కోరుకున్న విజయాన్ని అతనికి అందించింది. ‘ఫిదా’ పాటలు కూడా జనాన్ని కట్టిపడేశాయి. ఇందులోని పాటలు రికార్డు స్థాయిలోనూ జనాలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అందించిన సక్సెస్‌తో వరుణ్ తేజ్ హుషారుగా ముందడుగు వేశాడు. తరువాత తన బాబాయ్ పవన్ కళ్యాణ్ టైటిల్‌తో రూపొందిన ‘తొలి ప్రేమ’ కూడా వరుణ్‌కు మంచి విజయాన్ని అందించింది. సైన్స్ ఫిక్షన్‌గా వచ్చిన ‘అంతరిక్షం’ అంతగా మురిపించలేకపోయింది. ఆ తరువాత వెంకటేష్‌తో కలసి వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్-2’ అనూహ్య విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత వచ్చిన ‘గద్దలకొండ గణేష్’గానూ వరుణ్ మురిపించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బి.వి.యస్.యన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో వరుణ్ హీరో. ఈ సినిమాతోనైనా వరుణ్ కోరుకుంటున్న సక్సెస్ దరి చేరుతుందేమో చూడాలి.
(జనవరి 19న హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు)