Mayukha : ‘మయూఖ’కి 25 రోజుల సక్సెస్ వేడుక

Mayookha

Mayookha

శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వంలో, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించిన మయూఖ చిత్రం 25 రోజుల గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీతేజ్ మాట్లాడుతూ.. “నేను హనుమాన్ మాలలో ఉండి ఈ సినిమా ప్రమోషన్స్ చేశాను. ఆయన శక్తే మమ్మల్ని ముందుకు నడిపించింది. కేవలం పేరు కోసం కాకుండా, 25వ రోజు కూడా మా సినిమాకు 50 శాతం ఆక్యుపెన్సీ ఉండటం వల్లే ధైర్యంగా థియేటర్లలో రన్ చేస్తున్నాం. మొదట్లో చిన్న సినిమా అని ఎవరూ పట్టించుకోకపోయినా, జెన్యూన్ కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు ఆదరించారు” అని ఎమోషనల్ అయ్యారు. కంటెంట్‌ను నమ్ముకుని కష్టపడితే చిన్న సినిమాలకు కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్ వస్తాయని ‘మయూఖ’ సినిమా నిరూపించిందని ప్రొడ్యూసర్ శశిధర్ నల్ల ఆనందం వ్యక్తం చేశారు. “పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలే నిలబడలేని ఈ పరిస్థితుల్లో 25 రోజుల పాటు సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శితమవ్వడం మా టీమ్ అందరికీ గర్వకారణం” అని ఆయన తెలిపారు.

తనకు తెలుగులో ఇది తొలి చిత్రమని, రిలీజ్‌కు ముందే న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డ్ గెలుచుకున్న ఈ సినిమాకు ఇంతటి భారీ విజయం అందించిన ఆడియెన్స్‌కు హీరోయిన్ పాయల్ చెంగప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడి విజన్ మరియు కన్విక్షన్ అని నటులు రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ కొనియాడారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటామని, ప్రభుత్వం తరపున కూడా చిన్న సినిమాలకు అన్ని విధాలా సపోర్ట్ అందిస్తామని ముఖ్య అతిథి శ్రీశైలం యాదవ్ చిత్ర బృందానికి హామీ ఇచ్చారు.