Manchu Vishnu: అక్టోబర్ 5న ‘జిన్నా’ మూవీ విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని, సినిమా విడుదల వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అదే వార్తను చిత్ర కథానాయకుడు మంచు విష్ణు కన్ ఫామ్ చేశారు. తమ చిత్రం ‘జిన్నా’ను అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. నిజానికి ఈ మీటింగ్ బుధవారం జరగాల్సింది. అయితే సీనియర్ నటుడు కృష్ణ భార్య ఇందిరాదేవి మరణంతో దీనిని ఈ రోజుకు వాయిదా వేశారు.
ఈ మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ, ”చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాం. జి. నాగేశ్వర రెడ్డి గారు మూల కథ అందించారు. కోన వెంకట్ గారు ఆ కథను డెవలప్ చేశారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నాం. మా అందరికీ ఇదొక అద్భుతమైన జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి హిట్ అవుతుంది. అక్టోబర్ 21న విడుదల చేస్తున్నాం” అని తెలిపారు. దర్శకుడు సూర్య మాట్లాడుతూ, ”నేను మోహన్ బాబుగారి సంస్థలో సినిమా చేస్తానని అనుకోలేదు. నాకు అవకాశం ఇచ్చిన మోహన్ బాబుగారికి, విష్ణు గారికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది, పెద్ద హిట్ అవుతుంది” అని అన్నారు. జి. నాగేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ”దీపావళి కానుకగా దీనిని విడుదల చేస్తున్నాం. విష్ణు గారి కెరీర్ లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలు అని బ్లాక్ బస్టర్లే! ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడు సూర్య చాలా బాగా చేశాడు. ఇంత పెద్ద కాస్టింగ్ తో సినిమా చేయడం చాలా కష్టం, కానీ ఫస్ట్ కాపీ చూశాక బ్లాక్ బస్టర్ సినిమా రెడీ అయింది అనిపించింది. మోహన్ బాబు గారి బలమే మహిళా ప్రేక్షకులు, మాస్ ఆడియెన్స్. ఈ చిత్రం మహిళలకి సూపర్ గా నచ్చుతుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా అద్భుతంగా ఉంటుంది. కొత్త సన్నీ లియోన్ ని చూస్తారు. విష్ణు గారి పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంటుంది. చాలా రిస్కీ షాట్స్ చేశారు, డాన్స్ ఇరగదీసారు, ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి” అని అన్నారు.