Manchu Mohan Babu: భక్తవత్సలం నాయుడు.. ఈ జనరేషన్ లో ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. అదే మోహన్ బాబు అని చెప్పండి.. టక్కున కలెక్షన్ కింగ్ అని చెప్పేస్తారు. సరే ఇంతకు భక్తవత్సలం నాయుడు.. ఎవరు అని అడుగుతారా.. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తూనే ఉంటాం. అలా భక్తవత్సలం నాయుడు.. కాస్తా మోహన్ బాబుగా మారారు. అసలు ఎలా ఒక పిటీ టీచర్.. కలెక్షన్ కింగ్ గా మారారు అనేది తెలుసుకుందాం. చిత్తూరు జిల్లాలోని మోదుగు పాలెంలో ఓ సామాన్య మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు మోహన్ బాబు. ఆయన తండ్రి ఓ పాఠశాల పంతులు. ఇంట్లో పెద్దవాడు మోహన్ బాబు. తమ్ముళ్ళు ,చెల్లెళ్ళు ఉన్నారు. తండ్రి సంపాదించే జీతంతోనే ఇల్లు గడవడం కష్టమని భావించారు. దాంతో ప్లస్ టూ పాస్ కాగానే, ఫిజికల్ ఎడ్యుకేషన్ లో శిక్షణ తీసుకున్నారు. మద్రాసు వెళ్ళి అక్కడ ఓ పేరున్న ఉన్నత పాఠశాలలో పి.ఇడి.గా పనిచేశారు. అక్కడి వాతావరణం నచ్చక సినిమా రంగంలో అడుగుపెట్టారు. కొందరు దర్శకుల వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. కొన్ని సినిమాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. అలా సాగుతున్న భక్తవత్సలం నాయుడు జీవితాన్ని దాసరి నారాయణరావు రూపొందించిన స్వర్గం-నరకం చిత్రం మలుపు తిప్పింది. ఆ సినిమాతోనే భక్తవత్సలం నాయుడు కాస్తా మోహన్ బాబుగా పరిచయం అయ్యారు. ఆ తరువాత నుంచి దాసరి నారాయణరావు రూపొందించిన పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఆపైన బాపు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులు సైతం మోహన్ బాబుకు తగిన పాత్రలు ఇచ్చారు. ఆ రోజుల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా మోహన్ బాబు పలు పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఆయన నోటి నుంచి వచ్చే రైమింగ్ వర్డ్స్ ఎంతో ఫేమస్ అయ్యాయి.
మోహన్ బాబులోని విలక్షణతను గుర్తించిన ఆయన గురువు దాసరి నారాయణరావు, కేటుగాడు చిత్రంతో హీరోని చేశారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన మోహన్ బాబుకు, అవేవీ అంతగా అలరించలేదు. దాంతో సొంతగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థను స్థాపించి, తొలి ప్రయత్నంగా ప్రతిజ్ఞ చిత్రాన్ని నిర్మించి, నటించారు. అప్పటి నుంచి మోహన్ బాబు తన సొంత సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తూ హీరోగా సాగారు. అయితే మధ్యలో మళ్ళీ ఆయనను పరాజయాలు పలకరించాయి. అప్పుడు మళ్ళీ తనదైన అభినయంతో అలరించసాగారు. ముఖ్యంగా కామెడీ విలన్ గా మోహన్ బాబు విజయయాత్ర చేశారు. ఇక తన బ్యానర్ లో తాను హీరోగా కాకుండా, ఇతరులతో చిత్రాలు నిర్మించాలని భావించారు. ఆ సమయంలోనే మళయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం సినిమాను రీమేక్ చేయాలని రైట్స్ తీసుకున్నారు. వేరే హీరోను పెట్టి, తాను నిర్మాతగా వ్యవహరించాలనుకున్నారు. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో సన్నిహితుల సలహా మేరకు మళ్ళీ తానే హీరోగా మేకప్ వేసుకొని నటించారు. ఆ చిత్రమే అల్లుడుగారు.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన అల్లుడుగారు మంచి విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళీ తన సొంత సంస్థలో చిత్రాలు నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగారు.
ఇక మోహన్ బాబును కలెక్షన్ కింగ్ గా మార్చింది మాత్రం అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తర్వాత మోహన్ బాబు ఖాతాలో కలెక్షన్ కింగ్ అనే టైటిల్ చేరింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ తర్వాత పలు చిత్రాలలో మోహన్ బాబు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి. ఇక దీని తరువాత ఇటు సొంత చిత్రాలతోనూ, అటు బయటి సినిమాల్లోనూ మోహన్ బాబు హీరోగా విజయభేరీ మోగించారు. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్ తో మేజర్ చంద్రకాంత్ సినిమా తీసి మెప్పించాడు. మనదేశంలో నటనిర్మాతగా అత్యధిక చిత్రాలు నిర్మించిన ఘనత మోహన్ బాబు సొంతం. దాదాపు నలభైకి పైగా చిత్రాలు నిర్మించి, నటించారాయన. ఆ రికార్డు ఇప్పటికీ ఆయన పేరు మీదే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా విద్యానికేతన్ తో కూడా మోహన్ బాబు అందరి మన్ననలు అందుకున్నాడు. చదువు విలువ తెల్సిన ఆయన.. ఎంతోమందిని చదివించడానికి విద్యానికేతన్ పేరుతో ఒక స్కూల్ ను ప్రారంభించాడు. కులమతాలకు అతీతంగా అందరినీ ఒకేలా చూసే ఆదర్శ విద్యాలయాన్ని నెలకొల్పారు. ఆ విద్యాలయం నేడు ఉన్నత విద్యలకు నెలవుగా మారింది. తెలుగునేలపై అత్యుత్తమ విద్యాలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. విలన్ గా.. సహాయ నటుడిగా.. హీరోగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా.. విద్యా సంస్థల అధినేతగా .. బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభావంతుడిగా మోహన్ బాబుకు అభిమానులు ఉన్నారు. జీవితంలో కష్టనష్టాలను ఓర్చి, విజయాపజయాలను చూసి.. ఇప్పుడు కుమారుడు విష్ణుకు తోడుగా ఉంటున్నాడు. నేడు ఆయన 72 వ పుట్టినరోజు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే మంచు మోహన్ బాబు.