Raj Rachakonda:’మల్లేశం’ చిత్రంతో దర్శకుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు రాజ్ రాచకొండ. ఆయన ఇప్పుడో హిందీ సినిమాను తెరకెక్కించారు. ‘8 ఎ.ఎం. మెట్రో’ అనే ఈ సినిమాకు ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘అందమైన జీవితం’ నవల ఆధారం కావడం విశేషం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఈ నవల ఓ ప్రముఖ వార పత్రికలో సీరియల్ గా వచ్చింది. లోకల్ ట్రైన్ నేపథ్యంలో సాగే ఈ కథను రాజ్ రాచకొండ గుల్ఫన్ దేవయ్య, సయామీ ఖేర్, కల్పిక గణేశ్ ప్రధాన పాత్రధారులుగా సినిమాగా రూపొందించారు. కిశోర్ గంజితో కలిసి రాజ్ రాచకొండ నిర్మించిన ఈ సినిమా హిందీలో శుక్రవారం విడుదల కాబోతోంది. ఇందులో గుల్జార్ రాసిన కవితలను సందర్భానుసారంగా ఉపయోగించడం విశేషం. ఈ చిత్రానికి సన్నీ కుర్రపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె. రాబిన్స్ సంగీతం అందించారు. అనిల్ ఆలయం ఎడిటింగ్, ఉదయ్ తిరుచాపల్లి వి.ఎఫ్.ఎక్స్ బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలా ఉంటే… గతవారం తెలుగు దర్శకులు వి. వి. వినాయక్ రూపొందించిన ‘ఛత్రపతి’, సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ‘ఐ.బి. 71’ హిందీ చిత్రాలు ఉత్తరాదిన విడుదలయ్యాయి. కానీ పెద్దంత బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు రాజ్ రాచకొండ డైరెక్టర్ హిందీ సినిమా ‘8 ఎ. ఎం. మెట్రో’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగువాడి సత్తాను రాజ్ అయినా చాటుతాడేమో చూద్దాం!