సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ఎలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్లను టార్గెట్ చేస్తూ.. అసభ్యకరమైన పోస్టులు, ట్వీట్లు పెడుతుంటారు. తాము చేస్తోంది కరెక్టా, కాదా అనేది ఆలోచించరు.. ఏది తోస్తే అది చేసేస్తుంటారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్, సినిమాల్లో చేసే ఇంటిమేట్ సీన్లపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే.. కథానాయికలూ ఊరికే ఉండరులెండి, కొందరు అప్పటికప్పుడే ఘాటు రిప్లై ఇస్తూ ఆ ఆకతాయిల నోళ్ళు మూయించేస్తారు. తాజాగా మాళవిక మోహనన్ అదే పని చేసింది.
ఇటీవల ధనుష్‌తో కలిసి మాళవిక నటించిన ‘మారన్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. అందులో ఈ ముద్దుగుమ్మ పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేసింది. వాటిల్లో బెడ్ సీన్‌పై ఒక నెటిజన్.. మాళవిక నిర్వహించిన ‘ఆస్క్ మాళవిక’ సెషన్‌లో ఓ ప్రశ్న సంధించాడు. ఆ బెడ్ సీన్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ.. దాన్ని ఎన్నిసార్లు షూట్ చేశారు? అని అడిగాడు. అందుకు మాళవిక స్పందిస్తూ.. ‘నీ తలలో ఏదో పాడైనట్టుంది’ అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఆకతాయికి సరైన బుద్ధి చెప్పావంటూ, కొందరు మాళవికకు మద్దతు ఇచ్చారు.
ఇదిలావుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె అయిన ఈమె, తన తండ్రి సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘పెట్టా’, ‘మాస్టర్’ సినిమాలలో నటించిన ఈ భామ, నిత్యం హాట్ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాను హీటెక్కిస్తుంటుంది. ప్రస్తుతం యుధ్రా సినిమాలో నటిస్తోన్న ఈ అమ్మడు.. విజయ్ దేవరకొండతో కలిసి ఓ రొమాంటిక్ సినిమా చేయాలనుందని చెప్పి వార్తల్లోకెక్కింది. మరి, ఈమె కోరిక తీరుతుందా? లేదా? చూడాలి.