Kenishaa : జయం రవి వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఆ రోజు కోర్టుకు రాకపోతే అంతే!

Kenisha Aarthi

Kenisha Aarthi

కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రవి మోహన్, ఆయన భార్య ఆర్తికి విడాకుల వివాదం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సింగర్ కెనిషాకి మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. డిసెంబర్ 3న ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టు ఎదుట స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, ఒకవేళ ఆ రోజు గైర్హాజరైతే మాత్రం ఇక మరో అవకాశం ఉండదని, అదే రోజు విచారణను ముగించి నేరుగా తీర్పు వెలువరిస్తామని న్యాయస్థానం తీవ్రంగా హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికగా తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, పరువుకు భంగం కలిగించేలా కెనిషా పోస్టులు పెట్టారంటూ ఆర్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వివాదాస్పద పోస్టులను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. ఈ పరువు నష్టం దావాపై విచారణ చేపట్టిన హైకోర్టు తాజాగా కెనిషాకు ఈ అల్టిమేటం జారీ చేసింది.

భార్యాభర్తలైన రవి మోహన్, ఆర్తికి మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ప్రస్తుతం చెన్నై కుటుంబ న్యాయస్థానంలో వీరి విడాకుల కేసు నడుస్తోంది. అయితే ఆర్తితో విడిపోయిన తర్వాత సింగర్ కెనిషాతో రవి మోహన్ సన్నిహితంగా మెలుగుతుండటం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై రవి, ఆర్తికి బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో, పబ్లిక్‌గా మాట్లాడకూడదంటూ కోర్టు ఇద్దరికీ గ్యాగ్ ఆర్డర్ విధించింది. మరోవైపు, ఈ గొడవలో తన పేరును అనవసరంగా లాగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన కెనిషా.. రవికి దూరంగా ఉంటానని, చెన్నైని విడిచి వెళ్ళిపోతున్నానని గతంలోనే ప్రకటించారు. కానీ, ఆ గొడవ నుంచి ఆమె తప్పుకోవాలని చూసినా.. వేసిన పరువు నష్టం కేసు రూపంలో ఇప్పుడు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి. హైకోర్టు నేరుగా వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 3పైనే పడింది. ఆ రోజు కెనిషా కోర్టుకు హాజరై ఎలాంటి వివరణ ఇస్తారు? లేదంటే న్యాయస్థానం ఎలాంటి సంచలన తీర్పు ఇస్తుంది? అనేది కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.